Tue Dec 16 2025 14:16:52 GMT+0000 (Coordinated Universal Time)
Sydney Terror Attack : బోండీ బీచ్ కాల్పుల ఘటనలో నిందితుడికి హైదరాబద్ లింకులు
సిడ్నీ బోండీ బీచ్ లో కాల్పులకు తెగబడిన సాజిద్ అక్రమ్ కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

సిడ్నీ బోండీ బీచ్ లో కాల్పులకు తెగబడిన సాజిద్ అక్రమ్ కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాజిద్ అక్రమ్ నేపథ్యాన్నిపరిశీలిస్తే హైదరాబాద్ నుంచి వెళ్లినట్లు కనుగొన్నారు. అయితే సాజిద్ అక్రమ్ 27 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాకు వలస వెళ్లినట్లు చెబుతున్నారు. ఇక్కడి బంధువులతో సాజిద్ అక్రమ్ కు సంబంధాలు లేవని కూడా గుర్తించారు. సిడ్నీ బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో పాల్గొన్న వ్యక్తుల్లో ఒకరైన సజీద్ అక్రమ్ హైదరాబాద్‌లోని టోలిచౌకీ అల్హస్నత్ కాలనీ వాసిగా గుర్తించారు. సుమారు 27 ఏళ్ల క్రితం, 1998 నవంబర్‌లో ఉపాధి కోసం స్టూడెంట్ వీసాతో హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లో బీకాం పూర్తి చేసి...
హైదరాబాద్‌లో బీకాం పూర్తి చేసిన సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత అక్కడే వివాహం చేసుకున్నారు. యూరోపియన్ మూలాలు ఉన్న వెనెరా గ్రోస్సోను వివాహం చేసుకుని శాశ్వతంగా అక్కడే స్థిరపడ్డారు. వారికి ఒక కుమారుడు నవీద్ అక్రమ్, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు నవీద్ అక్రమ్ ఈ ఘటనలో మరో దుండగుడిగా గుర్తించారు. నవీద్ అక్రమ్ , కుమార్తె ఇద్దరూ ఆస్ట్రేలియాలోనే పుట్టడంతో ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. సజీద్ అక్రమ్ వద్ద ప్రస్తుతం భారత పాస్‌పోర్టు ఉంది. ఆస్ట్రేలియాలో వివాహం తర్వాత హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులతో సాజీద్ అక్రమ్ సంబంధాలు తగ్గిపోయినట్లు బంధువులు తెలిపారు. గత 27 ఏళ్లలో కుటుంబంతో పరిమిత స్థాయిలోనే సంప్రదింపులు కొనసాగినట్లు చెప్పారు.
ఆరుసార్లు భారత్ కు...
ఆస్తి వ్యవహారాలు, తల్లిదండ్రులను కలిసేందుకు మాత్రమే ఆయన ఆరు సార్లు భారత్‌కు వచ్చినట్లు సమాచారం. తండ్రి మరణించిన సమయంలో కూడా సాజిద్ అక్రమ్ భారత్‌కు రాలేదని తెలుస్తోంది. సాజిద్ అక్రమ్ లేదా ఆయన కుమారుడు నవీద్‌లో తీవ్రవాద ఆలోచనలు ఉన్నట్లు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. 1998లో దేశం విడిచే ముందు సాజిద్ అక్రమ్‌పై తెలంగాణ పోలీసుల వద్ద ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేవని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో, అవసరమైనప్పుడు కేంద్ర సంస్థలు, ఇతర ఏజెన్సీలతో పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ధృవీకరించిన సమాచారం లేకుండా ఊహాగానాలు చేయవద్దని ప్రజలు, మీడియాను కోరారు.
ఐఎస్ఐఎస్ భావాజాలంతో...
ఆస్ట్రేలియా పోలీసుల ప్రకారం, డిసెంబర్ 14 ఆదివారం సిడ్నీ బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకల సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, దాడి చేసిన వారిలో ఒకరు కూడా మరణించారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం పరిగణిస్తోంది. దుండగులుగా సాజీద్ అక్రమ్, ఆయన కుమారుడు నవీద్ అక్రమ్‌ను గుర్తించారు. వీరు ఐఎస్ఐఎస్ భావజాలంతో ప్రేరణ పొందినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనపై ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సాజిద్ అక్రమ్ కు హైదరాబాద్ మూలాలు ఉన్నాయని తెలియడంతో ఒక్కసారి హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడినట్లయింది.
Next Story

