Tue Jan 20 2026 09:22:03 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ మంచినీటి కొరత.. వృధా చేశారో.. మీ జేబుకు చిల్లే..భారీ జరిమానా
హైదరాబాద్ లో మంచి నీటి కొరత ఏర్పడింది. దీంతో వాటర్ బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్ లో మంచి నీటి కొరత ఏర్పడింది. దీంతో వాటర్ బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. భూగర్భ జలాలు అనేక చోట్ల పడిపోవడంతో పాటు మంజీర, గోదావరి నుంచి నగరానికి వచ్చే మంచినీటి పైపులైన్లలో ఇబ్బందులు తలెత్తడంతో అప్పుడప్పుడు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. జనవరి నెలలోనే ఇలా ఉంటే ఇక మార్చి నాటికి మంచినీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని గుర్తించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ జలమండలి అధికారులు ఈ మేరకు ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తితో కూడిన వార్నింగ్ లు ఇస్తున్నారు.
వాహనాలు కడిగినా...
తాగునీటిని వృధా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో రోజురోజకూ జనసాంద్రత పెరగడం, మంచి నీటి సరఫరా పెరగకపోవడంతో సరిపడినన్ని మంచినీటిని జలమండలి నగరవాసులకు అందించలేకపోతుంది. ఇప్పటికే రోజు మార్చి రోజు మంచినీటి సరఫరాను చేస్తుంది. పరిస్థితి మరింత తీవ్రమయితే రెండు రోజులకు ఒకసారి కానీ మంచినీటి సరఫరా చేయలేని పరిస్థితి ఉందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోనే తాగునీటితో ఇంటిని శుభ్రం చేసినా, కార్లు, బైకులు కడిగినా జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.
ప్రత్యేక యాప్ ద్వారా...
ఇందుకోసం జలమండలి అధికారులు ప్రత్యేక యాప్ ను తీసుకు వచ్చారు. నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి పానీ యాప్ ను అందుబాటులోకి తీసుకు రావాలని యోచిస్తుంది. ఈ యాప్ ద్వారా ఎవరైనా మంచినీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు వీడియోలు తీసి పంపితే వెంటనే జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు. అయితే కేవలం స్థానికులు మాత్రమే కాకుండా నగరంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారిని వాలంటీర్లగా ఎంపిక చేసి మంచినీటి దుర్వినియోగంపై నిఘా పెట్టాలని నిర్ణయించింది. నీటిని ఎవరైనా దుర్వినియోగం చేస్తే వెంటనే వారికి భారీ జరిమానా విధించనుంది.
మంచినీటి కొరత...
హైదరాబాద్ నగరానికి పన్నెండేళ్ల క్రితం అంటే 2014లో 600 ఎంజీడీ మంచినీటిసరఫరా చేసేది. హైదరాబాద్ లో మొత్తం పథ్నాలుగు లక్షలకు పైగానే మంచినీటి కనెక్షన్లున్నాయి. అయితే పన్నెండేళ్ల నాటికి ఇప్పటికీ జనాభా విపరీతంగా పెరిగింది. అనేక పరిశ్రమలతో పాటు కొత్త కొత్త పరిశ్రమలు, హోటళ్లు వంటివి నెలకొల్పారు. జనాభా కూడా దాదాపు కోటిన్నర దాటిందని అంటున్నారు. ఇంతమందికి తాగునీటిని సరఫరా చేయడానికి 600 ఎంజీడీ మంచినీరు సరిపోకపోవడంతో కొరత ఏర్పడిందన్న వాదన కూడా ఉంది. నీటిని దుర్వినియోగం చేసే వారిపై జలమండలి అధికారులు ఉక్కుపాదం మోపనున్నారు.
Next Story

