Thu Jan 29 2026 13:25:16 GMT+0000 (Coordinated Universal Time)
Kurnool Bus Accident : ప్రమాదానికి గురైన బస్సుపై ఎన్ని చలాన్లో.. ఇన్ని ఉన్నాయా?
కర్నూలు జిల్లా చిన్నటెకూరు సమీపంలో మంటలకు ఆహుతైన ప్రైవేట్ బస్సు తెలంగాణలో పలుమార్లు రోడ్డు నియమాలు ఉల్లంఘించినట్టు బయటపడింది

కర్నూలు జిల్లా చిన్నటెకూరు సమీపంలో మంటలకు ఆహుతైన ప్రైవేట్ బస్సు తెలంగాణలో పలుమార్లు రోడ్డు నియమాలు ఉల్లంఘించినట్టు బయటపడింది. తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల సమాచారం ప్రకారం, ఆ బస్సుపై ఇరవై మూడు వేల రూపాయల విలువైన ఇ–చలాన్లు ఉన్నాయి. వీటిలో మితిమీరిన వేగం, ప్రమాదకరంగా నడపటం, రాంగ్ డైరెక్షన్ లో డ్రైవ్ చేయటం వంటి కేసులు నమోదయ్యాయి. అదనంగా తొమ్మిది సార్లు నో–ఎంట్రీ ప్రాంతాల్లోకి ప్రవేశించినందుకు, అనుమతి లేని పార్కింగ్, ఆదేశాలు లెక్కచేయకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకూ జరిమానాలు విధించినట్లు చెప్పారు.
నిబంధనల ప్రకారం...
ప్రస్తుత నిబంధనల ప్రకారం, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రధాన రహదారులపై ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రైవేట్ బస్సులు ప్రవేశించకూడదు. అదే నియమం ఉల్లంఘించిన ఘటనలు కూడా ఈ వేమూరి కావేరి బస్సు రికార్డులో ఉన్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ స్పష్టంచేసింది ప్రమాదంలో పడ్డ బస్సు నెంబర్ DD01 N0430 సాంకేతికంగా బాగానే ఉందని, అవసరమైన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని తెలిపింది. ఫిట్ నెస్ సర్టిఫికేట్ తో పాటు, ఇన్సూరెన్స్ కు కూడా ఇంకాసమయం ఉందని తెలిపారు.
మంత్రి హెచ్చరిక...
మరొక వైపు ట్రావెల్స్ యజమానులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించద్దని తెలిపారు. హత్యానేరం కింద కేసులు పెడతామని, లోపలేస్తామని తెలిపారు. స్పీడ్ నిబంధనలు పాటించాలని, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని పొన్నం ప్రభాకర్ ప్రయవేటు బస్సుల యజమానులకు వార్నింగ్ హెచ్చరించారు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ఆరోపిస్తున్నారని, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని తెలిపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రవాణా మంత్రులతో సమావేశం ఏర్పాటుచేస్తామని, బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Next Story

