Fri Dec 05 2025 09:11:44 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad Metro : మెట్రో రైలు పై రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారా? అదే జరిగితే?
హైదరాబాద్ మెట్రో రైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి

హైదరాబాద్ మెట్రో రైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరచూ బెదిరింపులకు దిగుతున్న ఎల్ అండ్ టి సంస్థను మెట్రో రైలు కార్పొరేషన్ నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ఇప్పటికే మెట్రో రైలు ఎండీగా ప్రారంభం నుంచి పనిచేస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో మరొకరిని నియమించడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఎల్ అండ్ టి సంస్థ చేతులో మెట్రో రైలు ఉంటే తాము అనుకున్నట్లుగా నగరంలో విస్తరణ జరగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అందుకే త్వరలోనే ఎల్ అండ్ టి సంస్థ కు హైదరాబాద్ మెట్రో రైలు బాధ్యతలను తప్పించాలని ఆయన నిర్ణయించినట్లు అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
2017లో ప్రారంభమైన...
హైదరాబాద్ లో మెట్రో రైల్ 2017లో ప్రారంభమైంది. 29.14 కి.మీ. ఫేజ్-1 నెట్వర్క్ను ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తోంది. అంటే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఆ సంస్థ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. అయితే తరచూ తమకు నిర్వహణలో నష్టాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఛార్జీలు పెంచుకునేందుకు కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. అలాగే పార్కింగ్ స్థలాల వద్ద కూడా రుసుము పెంచింది. అయినా సరే ఎల్ అండ్ టి సంస్థ తరచూ నష్టాలు వస్తున్నాయని చెబుతూ తమను బెదిరిస్తుందన్న భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్లో నిర్మాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వాటా ఉంది. హైదరాబాద్ మెట్రో రైలులో రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నప్పటికి ఏడాదికి ఆరు వందల కోట్ల నష్టం వస్తోందని ఆ సంస్థ చెబుతుంది.
రెండు ప్రతిపాదనలు...
తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థ వాటా మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. లేదంటే మరొక ప్రముఖ సంస్థకు అప్పగించాన్న యోచనలోనూ ప్రభుత్వం ఉంది. ఎల్ అండ్ టీ ఎదుట ప్రభుత్వం రెండు ఆఫర్స్ పెట్టినట్లు సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. మొదటిది 15,000 కోట్లకు ఎల్ అండ్ టి నుంచి వాటాలను కొనుగోలు చేయడం ఒకటి. ఇందులో 13,000 కోట్ల లోన్ ట్రాన్స్ఫర్, .2,000 కోట్ల నగదు చెల్లింపు ఉంటుంది. రెండవది ఎల్ అండ్ టి ప్రైవేట్ గా తన వాటాలు అమ్మేసుకోవడానికి అవకాశం కల్పించడం. ఈ రెండింటిని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండో ప్రతిపాదనకే ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు. ఎల్ అండ్ టి సంస్థ ఉంటే విస్తరణ పనులు కూడా ఆలస్యమవుతాయని, తాము అనుకున్న లక్ష్యానికి చేరుకోలేమన్న భావనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు అధికార వర్గాల్లో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.
Next Story

