Fri Dec 05 2025 13:55:30 GMT+0000 (Coordinated Universal Time)
ప్రమాదాలకు కారణం ఎవరు? పరిశ్రమలు మృత్యువుకు కేరాఫ్ గా మారుతున్నా?
క పరిశ్రమల్లో ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది. అనేక మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కానీ అదే సమయంలో పరిశ్రమలు మృత్యువుకు మూలంగా మారుతున్నాయి. అనేక పరిశ్రమల్లో ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసియాఖండంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడ అయిన పటాన్ చెరు లో కార్మికులు తరచూ ప్రాణాలు కోల్పోతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో పాటు ప్రభుత్వ అధికారుల ఉదాసీనత వెరసి కార్మికుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. ఎన్ని ప్రమాద ఘటనలు జరిగినా తూతూ మంత్రంగా విచారణలు జరపడం, రెండు రోజుల తర్వాత మళ్లీ మామూలే.మామూళ్లకు అలవాటుపడిన ప్రభుత్వ అధికారులు చూసీ చూడటనట్లు వ్యవహరించడం వల్లనే ఈ దారుణం చోటు చేసుకుంది.
అనేక మంది మరణించినా...
పటాన్ చెరులోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సియాచీ రసాయన పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడులో 35 మంది కార్మికులు మరణించారు. 36 మంది వరకూ తీవ్రగాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య 47 వరకూ చేరుకునే అవకాశముంది. పటాన్ చెరు నియోజకవర్గంలో మొత్తం నాలుగు వేల వరకూ పరిశ్రమలున్నాయి. ఇందులో దాదాపు రెండు వేల వరకూ రసాయన పరిశ్రమలే ఉన్నాయి. వీటిని తనిఖీ చేయాలంటే పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది అవసరం. కానీ అరకొర సిబ్బందితో కార్మికుల రక్షణకు సంబంధించిన చర్యలు ఏమీ తీసుకోవడం లేదు. వేల సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నా తనిఖీ చేయడానికి పది మంది కూడా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
శిక్షణ ఇచ్చి...
రసాయన పరిశ్రమలో పనిచేయాలంటే అందులో అనుభవం, నిష్ణాతులైన కార్మికులను నియమించుకోవాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. కానీ అవేమీ జరగకుండా తక్కువ వేతనానికి వచ్చే ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పించుకుని వారిపై సూపర్ వైజర్ ను నియమించి పని కానిచ్చేస్తున్నారు.పటాన్ చెరు, పాశమైలారం, బొల్లారం, జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో అనేక పరిశ్రమలున్నా తనిఖీలు మాత్రం జరగకపోవడంతో యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. సరైన రక్షణ చర్యలు కూడా తీసుకోవడం లేదు.
లోపాలను పరిశీలించి...
పరిశ్రమల శాఖ, అగ్నమాపక శాఖ, కార్మిక శాఖ ఇలా తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ఎప్పటికప్పడు లోపాలను పరిశీలించి పరిశ్రమల యాజమాన్యానికినోటీసలు జారీ చేయాలి. కానీ తనిఖీలు చేయకుండానే పరిశ్రమలకు సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు. కేవలం ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసే అన్ని శాఖల అధికారులు తర్వాత మళ్లీ మామూలు అవుతున్నారు. బాయిలర్లు, రియాక్టర్లు పేలడం సర్వసాధారణంగా మారింది. కెమికల్ ఫ్యాక్టరీలు కావడంతో విషవాయువులు కూడా ప్రమాదకరంగా మారి కార్మికులను బలిగొంటున్నాయి. భధ్రతా ప్రమాణాలను పాటించని పరిశ్రమలపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే ఈ మృత్యుఘోష మాత్రం ఆగే అవకాశం లేదు.
Next Story

