Sat Jun 21 2025 04:21:10 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రియల్ రంగాన్ని దెబ్బతీసిన డాలర్ డ్రీమ్స్.. హైదరాబాద్ లో తగ్గిన క్రయ విక్రయాలు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్దబ్దుగా ఉన్నట్లు కనపడుతుంది. అనేక అధ్యయనాలు ఇవే చెబుతున్నాయి.

తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్దబ్దుగా ఉన్నట్లు కనపడుతుంది. అనేక అధ్యయనాలు ఇవే చెబుతున్నాయి. అనేక కారణాలు రియల్ రంగంలో స్తబ్దతకు కారణాలుగా చెబుతున్నారు. గతంలో ఫ్లాట్లు, ప్లాట్లు క్రయ విక్రయాలు జోరుగా జరిగేవి. కానీ కొన్ని రోజుల నుంచి అవి తగ్గుముఖం పట్టాయని రిజిస్ట్రేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని అంటున్నారు. అదే సమయంలో బిల్డర్లు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తక్కువ ధరలకే విక్రయిస్తామని చెబుతున్నప్పటికీ కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. మరీ నెల రోజుల నుంచి అంటే మే నెలలో రియల్ రంగం మరింత దిగజారిపోయిందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో పరిణామాలే...
ఇందుకు ప్రధాన కారణం అమెరికాలో జరుగుతున్న పరిణామాలు అని చెప్పాలి. ఈ ఏడాది జనవరి నుంచి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలతో పాటు ఆయన అనుసరిస్తున్న విధానాలు రియల్ రంగంపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు. అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించి తమ తల్లిదండ్రులకు ఇళ్లు కానీ, ఇంటి స్థలాలను కాని కొనుగోలు చేసి పెట్టేవారు. అవి భవిష్యత్ లో తమకు స్థిరాస్థిగా ఉంటుందని ఆశపడేవారు. కానీ గత కొన్ని రోజుల నుంచి డాలర్ డ్రీమ్స్ కరిగిపోతుంది. చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయడం పై నిషేధం విధించిన ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని అందుకోవడంతో అక్కడ ఉద్యోగాలకు కూడా భద్రత లేకుండా పోయింది.
ధరలు తగ్గించినా...
దీంతో రియల్ రంగంపై పెట్టుబడి పెట్టే వారు చాలా వరకూ తగ్గారని చెబుతున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల అనేక వెంచర్లుభారీగా వెలిశాయి. కమ్యునిటీ అపార్ట్ మెంట్లను ముందుగానే నిర్మించి రెడీ టు ఆక్యుపై అన్న నినాదంతో బిల్డర్లు రియల్ రంగానికి ఊపు తెద్దామని భావించారు. హైడ్రా కూల్చివేతలతో కొంత తగ్గినప్పటికీ అన్ని అనుమతులను న్యాయవాదులతో పరిశీలించిన తర్వాత కొనుగోలు చేసేవారు. కానీ మే నెల నుంచి మాత్రం తక్కువ ధరకు ఇస్తామన్న అపార్ట్ మెంట్ లో ఫ్లాట్లు కొనేవారు లేకుండా పోయారని, చదరపు గజంపై వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు తగ్గించినా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా తమ ఉద్యోగంలో భద్రత లేని కారణంగా హౌసింగ్ పై పెట్టుబడి పెట్టేకన్నా, వేరే ప్రత్యామ్నాయం వైపు చూస్తుండటంతో రియల్ రంగం నేల చూపులు చూస్తుంది.
Next Story