Tue Feb 03 2026 07:42:59 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : రంజాన్‌కు ముందే షాపింగ్ జోరు – పాతబస్తీలో సందడి
పవిత్రమైన రంజాన్ మాసానికి రెండు వారాలే ఉండటంతో నగరంలోని పాతబస్తీ ప్రాంతాల్లో షాపింగ్ సందడి మొదలైంది

పవిత్రమైన రంజాన్ మాసానికి రెండు వారాలే ఉండటంతో నగరంలోని పాతబస్తీ ప్రాంతాల్లో షాపింగ్ సందడి మొదలైంది. రంజాన్ సమయంలో ఎక్కువ సమయం ప్రార్థనలకు కేటాయించాలనే ఉద్దేశంతో చాలామంది ముందుగానే కొనుగోళ్లు చేసుకుంటున్నారు. దీనితో ప్రధాన మార్కెట్లలో వ్యాపారులు సరుకులు సిద్ధం చేసుకున్నారు. పాతబస్తీలోని పథ్థర్ ఘట్ , ఖిల్వత్ మార్కెట్, దేవన్దేవడి, రికాబ్‌గంజ్, పటేల్ మార్కెట్, మదీనా బిల్డింగ్, మూసాబౌలి, ఘాన్సీ బజార్ ప్రాంతాల మార్కెట్లలో పండుగ కొనుగోళ్లకు అవసరమైన కొత్త సరుకులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
రంజాన్‌కు ముందే కొనుగోళ్లు
ఇటీవలి కాలంలో కొత్త ధోరణి కనిపిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. రంజాన్ నెలలో ప్రార్థనలపై మరింత దృష్టి పెట్టాలనుకునే వారు, ముందుగానే అంటే ఈ నెలలోనే పండుగ కొనుగోళ్లు పూర్తి చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా రంజాన్‌కు ముందే షాపింగ్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్నవారు ముందే కొనుగోళ్లు ముగించుకుని రంజాన్‌లో ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. అందువల్ల తాము కూడా ముందు నుంచే సరుకును తెప్పించి ముందుగానే సిద్ధం చేసుకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారు ఖచ్చితంగా రంజాన్ పండగకు కొత్త దుస్తులు, ఇతర సామాన్లు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.
సాయంత్రం వేళల్లో షాపింగ్...
సాయంత్రం సమయాల్లో మార్కెట్లు సందడిగా మారుతున్నాయి. ఇప్పటి జనరేషన్ తో పాటు అందరికీ అనకూలమైన విధంగా దుస్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈరోజు ఫ్యాషన్‌కు అనుగుణంగా సరుకులు నిల్వ ఉంచారు. దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పోటీ పెరిగింది. దీనివల్ల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటున్నాయి. రోడ్డుపక్కన స్టాళ్లు ఏర్పాటు చేసే చిన్న వ్యాపారులు కూడా రంజాన్ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. ఈ మొదటి వారం నాటికి స్టాళ్లన్నీ కొత్త సరుకులతో నిండిపోతాయని వ్యాపారులు చెబుతున్నారు. చార్మినార్, మదీనా బిల్డింగ్ చుట్టుపక్కల దాదాపు ఐదు వేల వరకూ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ మహిళలు, పురుషులు, పిల్లల దుస్తులు, పాదరక్షలు, ఎంబ్రాయిడరీతో కూడిన డిజైనర్ చీరలు, సంప్రదాయంతో పాటు డిజైనర్ అబాయాలు, ముత్యాలు, క్రాకరీ, గృహోపకరణాలు తదితర వస్తువులు విక్రయిస్తున్నారు.
Next Story

