Hyderabad : మహిళలపై పెరుగుతున్న కేసులు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోఈ ఏడాది మహిళలపై కేసులు పెరిగాయి

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోఈ ఏడాది మహిళలపై కేసులు పెరిగాయి. నేరాలు నాలుగు శాతం పెరిగినట్లు పోలీస్ గణాంకాలు వెల్లడించాయి. వరకట్న హత్యలు, అపహరణ, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు గత ఏడాది పెరిగాయని పోలీసులు తెలిపారు.సోమవారం ఇక్కడ జరిగిన వార్షిక ప్రెస్మీట్లో రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. 2025లో మొత్తం 26,852 కేసులు నమోదయ్యాయని, వాటిలో 21,056 కేసులు పరిష్కరించామని చెప్పారు. దీంతో 78 శాతం కేసుల పరిష్కార రేటు సాధించామని తెలిపారు. గత ఏడాది 6,188 నిరోధక అరెస్టులు, 3,734 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కనిపించే పోలీసింగ్, వేగవంతమైన స్పందన, అనుమానితుల షీట్ల పర్యవేక్షణ, సంభావ్య నేరస్తుల అరెస్టులతో ఆస్తి నేరాలు 15 శాతం తగ్గాయని చెప్పారు. మొత్తం 4,121 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేసి, ‘జీరో–ఎన్బీడబ్ల్యూ’ కమిషనరేట్ హోదా సాధించినట్లు తెలిపారు.

