Tue Jul 08 2025 18:14:48 GMT+0000 (Coordinated Universal Time)
Sigachi Industry Accident : తొమ్మిది మంది కార్మికుల ఆచూకీ ఇక కష్టమే.. చేతులెత్తేసిన అధికారులు
పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఇంకా తొమ్మిది మంది జాడ కనిపించడం లేదు.

పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఇంకా తొమ్మిది మంది జాడ కనిపించడం లేదు. ప్రమాదం జరిగి ఆరు రోజులవుతున్నా కార్మికల ఆనవాళ్లు దొరకపోవడంతో కార్మికుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం డీఎన్ఏ పరీక్షల్లో కూడా ఆనవాళ్లు తేలకపోవడంతో దాదాపు అధికారులు చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది. కూలిపోయిన భవనాల శిధిలాలను తొలగించినా మాంసపు ముద్దలు, ఎముకలు మినహా మరేమీ కనిపించడం లేదు. వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే ఆ తొమ్మిది మందివి కావని తేలిపోయింది. ఆ తొమ్మిది మంది కార్మికుల కుటుంబాలు తమ వారి ఆచూకీ కోసం ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారు. అధికారులు మాత్రం ఇక వారి ఆచూకీ దొరకడం కష్టమేనని చెబుతున్నారు.
39కి చేరిన మృతుల సంఖ్య ...
పటాన్ చెరులోని పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 39కి చేరింది. కొన్ని చోట్ల శరీరభాగాలు లభించినా వాటిని డీఎన్ఏ పరీక్షలతో పోలిస్తే సరిపోలడం లేదు. ఈ ప్రమాదంలో ఎక్కువ మంది ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉండటంతో కార్మికుల కుటుంబ సభ్యులు అక్కడే ఉండి తమ వారి మృతదేహాలైనా లభిస్తాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అధికారులుమాత్రం ఇంకా గాలింపు కొనసాగుతుందని, కొంత ఓపిక పట్టాలని కార్మిక కుటుంబాలకు సర్ది చెబుతున్నారు తప్పించి, ఇక కార్మికుల మృతదేహాలు కష్టమేనని చెప్పలేకపోతున్నారు. కకుటుంబ సభ్యులు కూడా తమ వారి మృతదేహాలు కావాలని పట్టుబడుతున్నారు
మరోసారి వెతకాలని...
కనిపించని ఆ తొమ్మిది మందికోసం మరోసారి ఫ్యాక్టరీ ప్రాంగణం అంతా గాలించాలని నిర్ణయించారు. ప్రమాదం జరిగినప్పుడు భయపడిపోయి ఏ మూలకు వెళ్లి దాక్కుంటే అక్కడ ఏమైనా మానవ శరీర భాగాలు లభిస్తాయేమోనని ఇంకా వెదుకులాటను సహాయక సిబ్బంది కొనసాగిస్తున్నారు. తెలంగాణలోని ఇస్నాపూర్ కు చెందిన ముప్ఫయి ఆరేళ్ల సిల్వేరు రవి కనిపించడం లేదు. ఆయన ప్రమాదం జరిగిన రోజు విధులకు హాజరయినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ రవి ఆచూకీ లభించలేదు. ఇలా మరో తొమ్మిది మంది మృతదేహాలు లభించక బంధువులు రోదిస్తుండగా, మరో ప్రయత్నం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆరు రోజులవుతున్నా జాడ తెలియకపోవడంతో ఇక కష్టమేనన్నది అధికారుల నుంచి వినిపిస్తున్న మాట.
Next Story