Fri Dec 05 2025 09:32:06 GMT+0000 (Coordinated Universal Time)
మోగనున్న భాజాభజంత్రీలు శ్రావణం నుంచి మొదలయినట్లేగా?
త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో పెళ్లిళ్లు జోరుగా సాగుతాయి.

త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో పెళ్లిళ్లు జోరుగా సాగుతాయి. నాలుగు నెలల పాటు మంచి ముహూర్తాలున్నాయి. అవి దాటాయంటే ఇక మళ్లీ వచ్చే ఏడాది కోసం వెయిట్ చేయాల్సిందే. డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ మంచి ముహూర్తాలుండవు. ఈ నాలుగు మాసాల్లో భాజా భజంత్రీలు మోగుతాయి. ఇప్పటి వరకూ వివాహాల కోసం వేచి చూస్తున్న వారు ఇక ఈ నాలుగు నెలల్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే శ్రావణం సందడి ప్రారంభమయింది. అనేక ఫంక్షన్ హాళ్లు ముందుగానే బుక్ చేసుకంటున్నారు. పూజారుల నుంచి డెకరేషన్ చేసే వారి వరకూ, క్యాటరింగ్ చేసే వారికి ఈ నాలుగు నెలలు యమ డిమాండ్ ఉంటుంది.
ఈ నాలుగు మాసాల్లోనూ...
ఈ నాలుగు మాసాల్లోనూ కొన్ని రోజులు మాత్రమే మంచి ముహూర్తాలుండటంతో ఆరోజుల్లోనే ఎక్కువ మంది పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధమవుతుండటంతో అన్ని ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దాదాపు నెల రోజుల పాటు ఆషాఢమాసం ఉండటంతో పాటు మూఢమి కూడా రావడంతో ముహూర్తాలు లేవు. దీంతో ఈ నాలుగు నెలల్లో పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని పెద్దలు ముహూర్తాలు ముందుగానే నిశ్చయించుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటుండటంతో పెళ్లి సందడి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకూ మాత్రమే మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఇది దాటిందంటే మళ్లీ కార్తీక మాసంలోనే శుభఘడియలుంటాయని అంటున్నారు.
లక్షకు పైగానే...
పెళ్లిళ్లకు హైదరాబాద్ నగరంతో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఫంక్షన్ హాళ్లు ముందుగానే బుక్ అయ్యాయి. మార్కెట్ కూడా సందడిగా మారింది. వస్త్ర దుకాణాలు కూడా పెళ్లిళ్ల షాపింగ్ తో కళకళలాడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నాలుగు నెలల్లోనే దాదాపు లక్షకు పైగా వివాహాలు జరగవచ్చన్న అంచనాలు వినపడుతున్నాయి. మొత్తం మీద రానున్న నాలుగు నెలల పాటు భాజా భజంత్రీలు, విందుభోజనాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్యాణం - కమనీయం అన్న రీతిలో సాగనున్నాయి. ఫంక్షన్ హాళ్లు కూడా డిమాండ్ పెరిగి పోవడంతో కేవలం పన్నెండు గంటలకే ఇస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక క్యాటరింగ్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. సాదాసీదా భోజనం ప్లేట్ 900 రూపాయల వరకూ చెల్లించాల్సి వస్తుంది. మొత్తం తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చేసింది.
Next Story

