హైదరాబాద్‌లో 923 ఎకరాలు తిరిగి స్వాధీనం రూ. 45 వేల కోట్ల విలువైన భూములు ఆక్రమణల నుంచి విడిపించాం: కమిషనర్ రంగనాథ్
నగరంలోని సరస్సులు, పార్కులపై ఆక్రమణల తొలగింపులో భాగంగా 2024 జూలై నుంచి ఇప్పటివరకు 96 డ్రైవ్‌లు నిర్వహించి 923 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు.

హైదరాబాద్, సోమవారం: నగరంలోని సరస్సులు, పార్కులపై ఆక్రమణల తొలగింపులో భాగంగా 2024 జూలై నుంచి ఇప్పటివరకు 96 డ్రైవ్‌లు నిర్వహించి 923 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఈ భూముల విలువ రూ.45 నుంచి 50 వేల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ వివరాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సరస్సుల పునరుద్ధరణపై దృష్టి
ప్రస్తుతం ఆరు సరస్సుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఆక్రమణలు తొలగించడంతో వాటి నీటి విస్తీర్ణం 105 ఎకరాల నుంచి 75 ఎకరాలకు పెరుగుతుందని వివరించారు. నాలాలు, సరస్సులపై అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్లు ఆరోపణలపై వెర్టెక్స్, వంశిరాం, వాసవి వంటి బిల్డర్లపై 11 కేసులు నమోదు చేశామని రంగనాథ్ తెలిపారు.
“శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు కొనసాగుతున్నది. కాల్‌డేటా రికార్డులు, వాట్సాప్ సందేశాలను కూడా విశ్లేషిస్తున్నాం. బిల్డర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్న ఆరోపణలు అసత్యం” అని ఆయన స్పష్టం చేశారు.
నగరంలో వరద నివారణే లక్ష్యం
నగరంలో వరదల నివారణ కోసం ఈ చర్యలు చేపడుతున్నామని కమిషనర్ చెప్పారు. పది మీటర్ల వెడల్పు ఉన్న నాళాలు 1–2 మీటర్లకు తగ్గిపోవడంతో పారుదల సమస్యలు పెరిగాయని తెలిపారు. బస్తీల్లోని పేదవర్గాలే వరదలతో ఎక్కువగా నష్టపోతున్నారని గుర్తుచేశారు.
“పునరుద్ధరించిన చెరువులు, చెట్లు నాటిన పార్కులు నగరానికి శీతల వాతావరణాన్ని కల్పిస్తాయి. అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్‌ను కొనసాగిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.

