Sun Jun 22 2025 11:11:45 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో భూముల కొనలేమా? ఇక్కడ గజం ధర ఇరవై లక్షలకు పైమాటే
హైదరాబాద్ అంటేనే భూముల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు.

హైదరాబాద్ అంటేనే భూముల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. కేవలం తెలంగాణకు రాజధాని మాత్రమే కాదు. అంతకు మించి పర్యాటక కేంద్రం. హెల్త్ సిటీ. టెక్ నగరం ఇలా అన్ని హంగులున్న హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకోవాలని అందరూ భావిస్తారు. మరొక వైపు వాతావరణం కూడా రా రమ్మని పిలుస్తుంటుంది. ఈ సమయంలో గత పదేళ్ల నుంచి హైదరాబాద్ లో ఖాళీ స్థలాల ధరలు రెట్టింపు కాదు ఆరింతలయ్యాయనే చెప్పాలి. ఎవరో కోటీశ్వరులకు మినహా సాధారణ, మధ్యతరగతి ప్రజలతో పాటు వేతన జీవులు కూడా ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి భూములు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో హైదరాబాద్ జనాభా ఇప్పటికే కోటిన్నరకు దగ్గరలో ఉంది.
నడిబొడ్డున కొనాలంటే...
ఇక హైదరాబాద్ నగర శివార్లలో ధరలు కొంత అందుబాటులో ఉన్నా నగరం నడిబొడ్డున భూములు కొనుగోలు చేయాలంటే కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు సర్వీసులు, ఫ్లైఓవర్లు ఇలా అన్ని హంగులున్న హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. అయితే హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్ పల్లి వరకూ అసలు భూముల కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇక వ్యాపారాలు చేసుకుందామని వచ్చే వారు సయితం రెంట్ కు తీసుకోవాలే తప్ప సొంతంగా దుకాణాలను కొనుగోలు చేయడానికి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేయడం అసాధ్యమనే చెప్పాలి.
బేగంబజార్ లో ధరలు అన్నింటికన్నా...
అన్నింటికి మించి బేగంబజార్ వ్యాపారాలకు నెలవు. ఇక్కడ గజం భూమి ధర పది లక్షలకు పైగానే పలుకుతుంది. అదీ సందుల్లో అయితే. మెయిన్ రోడ్డులో ఉన్న బేగం బజార్ లోయితే గజం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు పలుకుతుంది. కొత్తగా స్థలాలు ఇక్కడ పుట్టుకు రావు. ఉన్న స్థలాలే ఎవరైనా విక్రయిస్తే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శిధిలావస్థకు చేరిన భవనాలను విక్రయిస్తే వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే చిన్న దుకాణం బేగంబజార్ లో పెట్టాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. అందుకే ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ కు ఎక్కువగా విక్రయానికి వస్తుంటాయి. దీంతో వేలంపాట నిర్వహించి మరీ కొనుగోలు చేస్తుంటారు.
నగరం విస్తరించడంతో....
దీంతో పాటు ఎక్కడికక్కడ వ్యాపారాలు విస్తరించాయి. కార్పొరేట్ సంస్థలు కూడా ఒక్క చోట మాత్రమే కాకుండా నగరంలో నలుమూలల తమ శాఖలను ప్రారంభిస్తున్నాయి. ఎక్కువగా కార్పొరేట్ సంస్థలు, హోటల్స్, జ్యుయలరీ దుకాణాలు, వస్త్ర దుకాణాలు అద్దె ప్రాతిపదికన మాత్రమే చెల్లిస్తూ తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే దాదాపు కూకట్ పల్లి, బంజారాహిల్స్, అమీర్ పేట్, లక్డీకాపూల్, మొహదీపట్నం, కొండాపూర్, మాదాపూర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, అబిడ్స్ వంటి ప్రాంతాల్లో ధరలు మామూలుగా పెరగలేదు. దీంతో హైదరాబాద్ నగరం విస్తరించినా ఎక్కడికక్కడ దుకాణలు పెరగడంతో పాటు జనాభా పెరగడంతోపాటు, రోజువారీ ప్రజలు వచ్చే సంఖ్య ఎక్కువగా ఉండటంతో భూముల ధరలు రెక్కలు వచ్చాయి.
Next Story