Fri Dec 05 2025 11:32:49 GMT+0000 (Coordinated Universal Time)
Jublee Hills Bye Elections : జూబ్లీహిల్స్ ప్రజలు ముందుగానే ఫిక్సయిపోయారా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా మూడేళ్లు సమయం ఉండటంతో తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రజల వద్దకు వెళుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో గెలుపు రెండు పార్టీలకు ఎక్కువ అవసరంగా కనిపిస్తుంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లకు ఈ గెలుపు అవసరం అని ఆ మేరకు నాయకులు శక్తివంచన లేకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ కు సవాల్...
బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఉప ఎన్నికల్లోనూ తమ స్థానాన్ని నిలటెట్టుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. అందుకే మరణించిన మాగంటి గోపీనాధ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు లభించకపోతే తాము ప్రభుత్వం చేసే ఆరోపణలకు విలువ ఉండదని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నే కోరుకుంటున్నారన్న సంకేతాలు వెళతాయని భావించి అది కొంత వేగంగానే ప్రచారాన్ని నిర్వహిస్తుంది. బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందంటూ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. మాజీ మంత్రులందరూ రంగంలోకి దిగారు. ఇప్పటికే బస్తీల్లో సభలు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బుల్ డోజర్ వస్తుందంటూ కేటీఆర్ హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం...
మరొకవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది సవాల్ గా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులకు అప్పగించారు.మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. నవీన్ యాదవ్ కుటుంబానికి బస్తీల్లో ఉండే పట్టుతో గెలుపు ఖాయమని భావిస్తున్నప్పటికీ సెంటిమెంట్ భయం కాంగ్రెస్ ను వెంటాడుతుంది. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల వేళ రెండు మూడు సభల్లో పాల్గొనే అవకాశముందని అంటున్నారు. కాంగ్రెస్ కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ప్రజల్లో ఏ మాత్రం ఆదరణ చెక్కు చెదరలేదని చెప్పుకోవడానికి ఈ ఎన్నికల్లో గెలుపు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
బీజేపీ తమను గెలిపించాలని...
ఇక బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ప్రచారంలో పాల్గొంటున్నారు. కిషన్ రెడ్డి ఎలాగైనా తన సన్నిహితుడైన దీపక్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు మరికొందరు కూడా రానున్న కాలంలో ప్రచారానికి వచ్చే అవకాశముందని అంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి కేంద్ర ప్రభుత్వ సాయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, తమను గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని చెపుతున్నారు. మరి మూడు పార్టీల్లో చివరకు గెలుపు ఎవరిదన్నది వచ్చే నెల 14వ తేదీన తేలనుంది.
Next Story

