Sat Dec 13 2025 22:35:55 GMT+0000 (Coordinated Universal Time)
Jubilee Hills Bye Elections : వార్ రూం నుంచి కీలక ఆదేశాలు.. పోలింగ్ పెరిగితే ఎవరికి లాభం?
జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది

జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ రాత్రికి చేసే వ్యూహాలే గెలుపోటములను నిర్ధారిస్తాయి. అందుకే ఈరాత్రి అన్ని పార్టీలకు కీలకం అని చెప్పాలి. పోలింగ్ పెరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టమన్న అంచాలు కూడా వేసుకుని మరీ ఓటర్లను ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదయిన ఓటర్లు వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉండటంతో వారిని రేపు పోలింగ్ లో పాల్గొనేలా చేసేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా తలపడుతున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 47 శాతం పోలింగ్ మాత్రమే నమోదయింది.
పోలింగ్ కేంద్రాలకు...
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడు పార్టీలకు చెందిన వారు వార్ రూమ్ ను ఏర్పాటు చేసుకుని పోలింగ్ తీరును పర్యవేక్షిస్తున్నాయి. క్యాడర్ కు లీడర్లకు స్పష్టమైన సంకేతాలను అందచేస్తున్నాయి. కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాన్ని ఇప్పటి వరకూ చేసిన పార్టీ నేతలు ఇక ఈ రాత్రికి బస్తీ లోని నేతలతో తమకు అనుకూలంగా ఓటర్లను మలచుకునేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. పోలింగ్ సందర్భంగా బయట వారు ఎవరూ నియోజకవర్గంలోకి అడుగుపెట్ట కూడదన్న నిబంధన మేరకు ఆ బస్తీ నేతలను ఉపయోగించుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ శాతం పైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని విశ్వసిస్తున్నారు.
గతంలో వచ్చిన ఓట్ల శాతాన్ని...
గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని లెక్క వేసుకుని మరీ పార్టీలు ముందుకు వెళుతున్నాయి. మూడు పార్టీలూ ఎవరికి వారే గెలుపు పై ధీమాగా కనిపిస్తున్నారు. టీడీపీ ఇంత వరకూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. మరొకవైపు జనసేన బీజేపీకి మద్దతు తెలిపింది. ఇక వైసీపీ కూడా ఎవరికీ మద్దతు తెలపలేదు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరి ప్రచారం వారు చేసుకున్నారు. అయితే తమకు మూడేళ్ల సమయం ఉండటంతో కాంగ్రెస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కారుకు, బుల్ డోజర్ కు మధ్య జరుగుతున్న ఎన్నికలివి అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసింది. బీజేపీ కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే తమకు అవకాశం ఇవ్వాలని కోరుతుంది. మొత్తం మీద రాత్రికి జరిగే వ్యూహాలపైనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Next Story

