Tue Jan 20 2026 21:08:03 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం.. అలెర్ట్ అయిన అధికారులు
హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది.

హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా చినుకులు పడుతున్నాయి. నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో రహదారులపై నీళ్లు నిలిచాయి. ఈరోజు ఉదయం కాస్త వర్షం తెరపించినప్పటికీ నల్లటి మబ్బులతో చీకటి వాతావరణం నెలకొంది. సూర్యుడు కనిపించలేదు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. విద్యాసంస్థలకు వెళ్లే వారు, ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బందులు పడతారు.
మూడు రోజుల నుంచి...
హైదరాబాద్ నగరంలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. వాహనాలు కూడా వర్షపు నీటిలో చిక్కుకుని మొరాయిస్తున్నాయి.ఈరోజు తెల్లవారు జాము వరకూ కూడా భారీ వర్షం కురిసింది. రహదారులపై నీరు నిలవడంతో కొన్ని చోట్ల ఉదయం నుంచి వాహనాలతో వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేఘాలు దట్టంగా అలుముకోవడంతో ఈరోజు భారీ వర్షం కురుస్తుందన్న కారణంతో కొందరు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రహదారుల్లో ట్రాఫిక్ స్థంభించకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో...
మరొక వైపు వాతావరణ శాఖ నగరానికి భారీ వర్షం ముంచెత్తనుందని అలెర్ట్ జారీ చేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. హైడ్రా సిబ్బంది కూడా అవసరమైన ప్రాంతాల్లోకి వచ్చి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు ఈరోజు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దనితెలిపారు. ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పురాతన భవనాలు ప్రమాదకరమైన పరిస్థితికి చేరడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
Next Story

