Sun Mar 15 2026 11:17:35 GMT+0530 (India Standard Time)
Hyderabad : మూడు వేల కోట్ల మోసం.. బాధితులకు డబ్బులు అందేనా?
తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచిన సాహితీ ఇన్ ఫ్రా కుంభకోణంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచిన సాహితీ ఇన్ ఫ్రా కుంభకోణంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తక్కువ ధరకే ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామంటూ ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో వేల మందిని నట్టేట ముంచిన సాహితీ ఇన్ఫ్రా కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టించింది. ప్రీ లాంచ్ పేరుతో భారీగా మోసానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభ కోణం విలువ మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాలుగేళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత, పోలీసులు ఈ కేసులో కీలకమైన ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఛార్జిషీట్ లో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సాహితీ ఇన్ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ , అతని బృందం ఏ విధమైన అనుమతులు లేకుండానే అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులను ప్రకటించారు.
ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో...
ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో మార్కెట్ ధర కంటే తక్కువకే ఇస్తామని నమ్మించి మధ్యతరగతి ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేశారు. కానీ ఇళ్లు కట్టలేదు. ఇప్పటివరకు ఈ సంస్థపై 64 కేసులు నమోదు కాగా, వాటన్నింటిపై సీసీఎస్ ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రధానంగా అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్టుపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు నమోదు కాగా, వీటిపైనే ఇప్పుడు ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఈ ప్రాజెక్టు పేరుతో దాదాపు దాదాపు ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులకు ప్లాట్లు ఇవ్వకపోగా, ఆ డబ్బును లక్ష్మీనారాయణ తన సొంత ప్రయోజనాల కోసం, విలాసాల కోసం మళ్లించినట్లు ఆధారాలు సేకరించారు.
పదమూడు నిందితులను...
ఈ కుంభకోణంలో కేవలం లక్ష్మీనారాయణ మాత్రమే కాకుండా, మొత్తం పదమూడు మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. సంస్థ డైరెక్టర్లు, కీలక ప్రతినిధులు ఈ మోసంలో భాగస్వాములైనట్లు అభియోగాలు నమోదయ్యాయి. అనుమతులు లేని భూములను చూపించి, నకిలీ బ్రోచర్లు సృష్టించి ప్రజలను ఏ విధంగా వంచించారో పోలీసులు ఈ ఛార్జ్‌షీట్‌లో వివరించారు. నాలుగేళ్లుగా తమ సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులకు ఈ ఛార్జ్‌షీట్ ను పోలీసులు దాఖలు చేయడంతో సాహితీ ఇన్ ఫ్రా నుంచి డబ్బులు తిరిగి చెల్లించిన వారికి ఇచ్చే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. మొత్తం మీద సాహితీ ఇన్ ఫ్రా బాధితులకు ఛార్జిషీట్ దాఖలు పెద్ద ఊరట అని చెప్పాలి.
Next Story

