Sat Dec 13 2025 19:28:58 GMT+0000 (Coordinated Universal Time)
IBomma Ravi :ఎగతాళి చేసినందుకు కోట్ల రూపాయలు సంపాదించి.. ఇలా దొరికిపోయాడు
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇమ్మడి రవిని డబ్బు లేదని ఎగతాళి చేసినందుకే ఈ ఐబొమ్మ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశాడు. అతని కుటుంబ సభ్యులు కూడా చిన్న చూపు చూడటంతో పాటు భార్య డబ్బు లేదని వదిలి వెళ్లడం వల్లనే ఐబొమ్మను ఏర్పాటు చేసినట్లు ఇమ్మడి రవి పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇమ్మడి రవి సాంకేతికంగా పట్టు ఉన్న వ్యక్తి కావడంతో ఏ రకంగా సంపాదించాలని, త్వరగా కోట్లు సంపాదించాలన్న ధ్యేయంతోనే ఐ బొమ్మ కు శ్రీకారం చుట్టారు. అనుకున్నట్లుగానే ఇమ్మడి రవి కోట్లాది రూపాయలు కూడబెట్టాడు. తాను ప్రపంచంలోని అన్ని దేశాల్లో పర్యటించారు.
కోట్ల రూపాయల నగదు...
ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినప్పుడు మూడున్నర కోట్ల రూపాయల ను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇంకానలభై బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు డబ్బు ఉందని పోలీసులు గుర్తించారు. విదేశీ బ్యాంకుల నుంచి పెద్దయెత్తున నగదు ఇతని ఖాతాలో జమ కావడాన్ని గుర్తించారు. దీంతోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంట్రీ ఇచ్చింది. పెద్దయెత్తున నిధులు విదేశాలకు పంపారని, మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే త్వరలోనే ఈడీ అధికారులు కూడా ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయనున్నారు. 2018లో ఐబొమ్మ ను ఏర్పాటు చేయాలనుకున్నాడు. అది 2019 నాటికి కాని సాధ్యపడలేదు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడతాయని భావిస్తున్నారు.
బీఎస్సీ కంప్యూటర్స్ చదవి...
ఇమ్మడి రవి బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడు, తర్వాత వెబ్ డిజైర్, డొమైన్ డెవలెపర్ గా మారి తాను కోట్ల రూపాయలు సంపాదించాలన్న ఉద్దేశ్యంతోనే ఐబొమ్మను ఏర్పాటు చేసి పైరసీ సినిమాలకు మరింత సొబగులు అద్ది ఐబొమ్మలో పెట్టేవాడు. దాదాపు యాభై లక్షల మంది ఫాలోయర్స్ ను సంపాదించాడు. ఇక యాడ్స్ రూపంలోనూ లక్షలాది రూపాయలు ప్రతి వారం వచ్చేవి. ఇక కరేబియన్ దీవుల్లో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే అంతా నడిపాడు. అక్కడే సెటిల్ అయిపోవాలనుకున్నాడు. అంతకు ముందు వచ్చిన డబ్బులతో హైదరాబాద్, విశాఖలలో పెద్దయెత్తున భూములు, ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. వాటిని అమ్ముకునేందుకు వచ్చిన ఇమ్మడి రవి పోలీసులకు దొరికిపోయాడు. మొత్తం మీద కుటుంబ సభ్యులు, స్నేహితులు గేలి చేయడం వల్లనే ఐబొమ్మ ఆవిర్భావం జరిగిందన్నది పోలీసుల విచారణలో ఇమ్మడి రవి తెలిపాడు.
Next Story

