Sat Jan 31 2026 09:45:47 GMT+0000 (Coordinated Universal Time)
రైలుకు ఎదురెళ్ల కుటుంబం బలవన్మరణం
రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

చర్లపల్లి–ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంఎటీఎస్ డౌన్ లైన్లో శనివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం సుమారు 2.30 గంటల సమయంలో చర్లపల్లి సెక్షన్ పరిధిలోగూడ్స్ రైలు లోకో పైలట్ వాకీటాకీ ద్వారా సమాచారం అందించారు. రైల్వే పట్టాలపై ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఐపీఎఫ్, చర్లపల్లిపోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పట్టాల మధ్యలో...
రైల్వే పట్టాల మధ్యలో మూడు మృతదేహాలు తీవ్ర గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించారు. మృతులను బోడుప్పల్, హరితహరణం కాలనీకి చెందిన పి. సురేందర్ రెడ్డి, పి. విజయ, పి. చేతన రెడ్డిలుగా గుర్తించారు. గూడ్స్ రైలుకు ఎదురు వెళ్లి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అయితే వీరి బలవన్మరణానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. మృతుల వద్ద ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేకపోవడంతో పాటు విలువైన వస్తువులు కూడా లభించలేదని జీఆర్పీ పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story

