Fri Dec 05 2025 12:23:03 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : ఆక్రమణదారులను హడలెత్తిస్తున్న హైడ్రా .... శనివారం వచ్చిందంటే చాలు.. కూల్చివేతలు షురూ
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రభుత్వ భూములను ఇప్పటికే రక్షించడం ప్రారంభించింది

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రభుత్వ భూములను ఇప్పటికే రక్షించడం ప్రారంభించింది. హైడ్రా ప్రారంభమయిన తర్వాత వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ భూములను హైదరాబాద్ నగరంలో ఆక్రమణలకు గురవుతున్నాయి. స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులతో లోకల్ పొలిటీషియన్లు కలసి ఈ ఆక్రమణలను గత కొన్ని దశాబ్దాలుగా ప్రోత్సహించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయం నుంచే ఈ ఆక్రమణలు విపరీతంగా జరిగాయి. అయితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆక్రమణల తొలగింపు విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది. దీంతో ఆక్రమణదారులు మరింత రెచ్చిపోతున్నారు.
విలువైన భూములు కావడంతో...
హైదరాబాద్ నగరం ఎప్పటికప్పడు విస్తరిస్తూనే ఉంటుంది. రెండు దశాబ్దాల క్రితం నగరానికి ఇప్పటి హైదరాబాద్ నగరానికి పొంతన లేదు. అందుకే ఇక్కడ భూముల విలువ కూడా ఎక్కువే. అయితే ప్రయివేటు భూములు ఎవరికి వారు రక్షించుకుంటుంటారు. కానీ అనాధలుగా మారిన ప్రభుత్వ భూముల విషయంలో మాత్రం అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో పాటు రెవెన్యూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం అధికారులు కూడా ఆక్రమణదారులతో కుమ్మక్కవుతున్నారు. వీరికి తోడు ఆక్రమణలదారులకు విద్యుత్తు కనెక్షన్ లతో పాటు నల్లా కనెక్షన్లు కూడా ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ వారి నుంచి ఇంటి పన్నులను కూడా వసూలు చేయడం ఆక్రమణదారులకు వరంగా మారింది.
ఇప్పటివరకూ వేల కోట్ల...
అయితే హైడ్రా ఆవిర్భవించిన తర్వాత నగరంలో విలువైన ఆక్రమిత భూమిని తిరిగి ప్రభుత్వ పరం చేయడానికి కృషి చేస్తుంది. పేదల నివాసాలతో పాటు బడా బాబుల నిర్మాణాలను కూడా తొలగిస్తుంది. నాలాలు, చెరువుల ఆక్రమణలతో పాటు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది.నగరంలోని సరస్సులు, పార్కులపై ఆక్రమణల తొలగింపులో భాగంగా 2024 జూలై నుంచి ఇప్పటివరకు అనేకచోట్ల దాడులు నిర్వహించి 923 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఈ భూముల విలువ రూ.45 నుంచి 50 వేల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు.చెరువుల పునరుద్ధరణపై దృష్టి ప్రస్తుతం ఆరు చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఆ
ఏడు కోట్ల విలువైన...
తాజాగా హైడ్రా సిబ్బంది అతి విలువైన భూములను నేడు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. కొండాపూర్ లోని బిక్షపతి నగర్ లో దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి రైతులు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని హైడ్రా అధికారులు తెలిపారు. హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మొత్తం 36 ఎకరాల్లో ఉన్న నిర్మాణాలను ఈ రోజు ఉదయం నుంచి హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఈ భూముల విలువ ఏడు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. ఈరోజు ఉదయం నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య 36 ఎకరాల్లో నిర్మాణాలు కూల్చివేశారు. సర్వే నెంబర్ 59లో ఉన్న 36 ఎకరాల స్థలాన్ని 12 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూల్చివేతల విషయం తెలిసిన స్థానికులు భారీగా అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. కూల్చివేతలు కొనసాగుతున్న స్థలానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

