Sat Dec 13 2025 22:32:14 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు కోట్ల విలువైన పరికరాలు స్వాధీనం
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్మగ్లింగ్ యత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్మగ్లింగ్ యత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. అబుదాబీ నుంచి అక్రమంగా తెచ్చిన డ్రోన్లు, ఐఫోన్లు, ఐవాచ్‌లు కలిపి సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అందించిన సమాచారం మేరకు, సీఐఎస్ఎఫ్ విజిలెన్స్ బృందం అనుమానాస్పదంగా ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుంది. వారిని చెన్నైకి చెందిన మహ్మద్ జహంగీర్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన సి. జయరాం రాజుగా గుర్తించారు.
అబుదాబీ నుంచి...
ఇద్దరూ కస్టమ్స్ అధికారుల తనిఖీలను తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. వారి సామాన్లను తనిఖీ చేయగా, 8 హైఎండ్ డ్రోన్లు, 65 ఐఫోన్లు, 50 ఐవాచ్‌లు, 4 వీడియో గేమ్ కన్సోళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారు అబుదాబీ నుంచి వచ్చిన ఎతిహాద్ ఎయిర్వేస్ విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. స్మగ్లింగ్‌లో పెద్ద నెట్వర్క్ ఉండొచ్చని అనుమానంతో కస్టమ్స్ అధికారులు ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీంతో స్మగ్లింగ్ గుట్టు రట్టయింది.
Next Story

