Sat Dec 06 2025 02:31:04 GMT+0000 (Coordinated Universal Time)
Metro Train Hyderabad : రెయిన్ ఎఫెక్ట్.. మెట్రో రైళ్లన్నీ కిటకిట...ఆక్యుపెన్సీ రేటు భారీగా పెరిగి?
హైదరాబాద్ మెట్రోరైళ్లకు గత కొంతకాలంగా రద్దీ పెరిగింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎక్కువ మంది మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు

హైదరాబాద్ మెట్రోరైళ్లకు గత కొంతకాలంగా రద్దీ పెరిగింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎక్కువ మంది మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రహదారులపై గంటలకొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకునే కంటే మెట్రో రైలు ప్రయాణం సుఖవంతంగా సాగుతుందని భావించి ఎక్కువ మంది మెట్రో రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సొంత వాహనాలను పక్కన పెట్టి మరీ మెట్రో రైలును ఆశ్రయిస్తుండటంతో రైళ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి. సురక్షితంగా, వేగంగా గమ్యస్థానానికి చేరుకునేందుకు మెట్రో దోహదపడుతుందని భావించి ఆర్టీసీ బస్సుల కంటే మెట్రో రైళ్లలో ప్రయాణం కాసేపు నిల్చున్నప్పటికీ నలభై నిమిషాల్లో తమ ఇళ్లకు చేరుకోవచ్చన్న భావన నగరవాసుల్లో కలిగినట్లుంది.
చార్జీలు పెరిగినా...
హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు ఇటీవల పెరిగాయి. ఈ ఏడాది మే 17వ తేదీ నుంచి పెంచిన ఛార్జీలు అమలులోకి వచ్చాయి. కనీసం పది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకూ ఛార్జీలు పెంచింది. కొన్ని ప్రాంతాల్లో ఇరవై రూపాయల వరకూ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయినా సరే మెట్రో రైలు ఛార్జీలు పెరిగినా భారీ వర్షాలకు ఇబ్బందిపడేకంటే మెట్రో రైలు ప్రయాణం సురక్షితమని భావించే వారి సంఖ్య ఎక్కువయింది. అందుకే ఇటీవల కాలంలో ఆక్యుపెన్సీ రేటు కూడా బాగా పెరిగిందని మెట్రో రైలు వర్గాలు వెల్లడించాయి. నిజానికి మెట్రో రైలులో ప్రయాణం సులువుగా మారడం నిజమే కాని, రద్దీతో కొందరు భయపడిపోతున్నారు.
సంఖ్యను పెంచితే...
అప్పటికీ మెట్రో రైళ్లు ప్రతి ఐదు నిమిషాలకు ఒక మెట్రో రైలు పట్టాలపై పరుగులు పెడుతూనే ఉంది. కానీ పీక్ అవర్స్ లో మాత్రం అంటే ఉదయం 8 గంటల నుంచి పదకొండు గంటల వరకూ, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ రద్దీని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అదనపు రైళ్లను కానీ, కోచ్ లను కానీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రజల నుంచి డిమాండ్ వినపడుతుంది. కానీ తాము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదనపు భారాన్ని భరించలేమని మెట్రో రైలు డెవలెప్ మెంట్ కార్పొరేషన్ చెబుతుంది. ఇంకొన్ని సర్వీసులు కానీ, కోచ్ లు కానీ పీక్ అవర్స్ లో పెంచగలిగితే ఇక హైదరాబాదీలకు మెట్రో రైళ్లకు మించిన సురక్షిత ప్రయాణం మరొకటి ఉండదన్న కామెంట్స్ బాగా వినపడుతున్నాయి.
Next Story

