Tue Mar 10 2026 19:02:12 GMT+0530 (India Standard Time)
Hyderabad : గ్యాస్ కొరతతో... హోటళ్లు క్లోజ్ అవుతాయా?
హైదరాబాద్ లో హోటళ్లు మూతబడే పరిస్థితికి చేరుకున్నాయి

హైదరాబాద్ లో హోటళ్లు మూతబడే పరిస్థితికి చేరుకున్నాయి. హైదరాబాద్ నగరం విస్తరించే నగరం. హైదరాబాద్ నగరంలో దాదాపు ఇరవై వేల హోటళ్లున్నాయి. ఇవి కాకుండా చిన్న హోటళ్ల సంఖ్య మరో ముప్ఫయి వేల వరకూ ఉంటాయి. వీటి ద్వారా పది లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా ఆధారపడి పనిచేస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా హైదరాబాద్ నగరంలో హోటళ్లు మూతబడే పరిస్థితికి వచ్చాయని హైదరాబాద్ హోటళ్ల అసోసియేషన్ చెబుతుంది. రేపటి వరకూ కొన్ని హోటళ్లు నడుస్తాయని, ఎల్లుండి నుంచి చాలా వరకూ హైదరాబాద్ నగరంలో హోటళ్లు మూతబడే అవకాశముందని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు రంజాన్, ఉగాది పండగలు వస్తుండటంతో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
గ్యాస్ సిలిండర్లపై నియంత్రణ...
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై నియంత్రణ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హోటళ్లకు, సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హాస్టళ్లకు మాత్రమే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మధ్య ప్రాచ్యంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో ఎల్.పి.జి సమస్య ఏర్పడే అవకాశముందని భావించి ముందస్తు చర్యలను ప్రారంభించింది. అందులో భాగంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయే అవకాశముండటంతో హోటల్స్ రంగం తీవ్ర సంక్షోభంలో పడే అవకాశముందని భావిస్తున్నారు.
అత్యవసర సమావేశం....
ఇప్పటికే హైదరాబాద్ లోని హోటల్స్ అసోసియేషన్ సమావేశమై పరిస్థితి తీవ్రతపై చర్చించాయి. నగరంలో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. వాణిజ్య గ్యాస్ సరఫరా దాదాపు తగ్గిపోవడంతో హోటల్స్ నడపడం కష్టమని అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి తెలిపారు. హోటల్స్ పరిశ్రమకు గ్యాస్ ముఖ్యమైనదని, ఇప్పటికే నిల్వలు తగ్గిపోయి వంటలు చేయడం కష్టంగా మారిందని ఆయనతెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే హోటళ్లను మూసివేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే రానున్న రెండు, మూడు రోజుల్లో పరిస్థితి మరింత ఆందోళన కరంగా మారే అవకాశముందని తెలిపింది. దీనివల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

