Fri Apr 10 2026 22:49:10 GMT+0530 (India Standard Time)
Hyderabad : గ్యాస్ కొరత ఎఫెక్ట్....హైదరాబాద్ లో పడకేసిన పర్యాటక రంగం
హైదరాబాద్ కు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ కు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం అనేక మంది హైదరాబాద్ నగరానికి వస్తుంటారు. నిమ్స్ తో పాటు నిలోఫర్ వివిధ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వస్తుంటారు. రోజుకు వేల సంఖ్యలోనే రోగులతో పాటు వారి బంధువులు కూడా హైదరాబాద్ కు వస్తుంటారు. రోగుల విషయం పక్కన పెడితే రోగుల బంధువులు మాత్రం అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. హోటల్స్ లో ధరలు ఒక్కసారిగా పెరగడంతో వారిపై అదనపు భారం పడినట్లయింది. చిరు హోటళ్ల నుంచి మోస్తరు హోటళ్ల వరకూ ఇడ్లీ, ఉప్మా వంటి వాటిని కూడా అధిక ధరలకు విక్రయిస్తుండటంతో జేబులకు చిల్లు పడుతున్నాయి.
ధరలను పెంచి...
కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ రంగం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. మెనూను కుదించి ధరలను పెంచి విక్రయిస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గ్యాస్ తో కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతులతో వంటలు చేసి సిద్ధం చేస్తున్నా వాటి ధరలతో కడుపు నిండకపోగా తరుక్కుపోతుంది. హోటల్ యజమానులది కూడా తప్పు కాదు. గ్యాస్ ఉంటే సులువుగానే వంటలు సాధ్యమయ్యేది. అయితే ఇప్పుడు వంట చెరుకు, బొగ్గుల ధరలు కూడా పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ధరలు పెంచి విక్రయించక తప్పడం లేదని హోటల్స్ అసోసియేషన్ చెబుతుంది. ప్రజలు కూడా తమతో సహకరించాలని కోరుతుంది.
స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా...
ఇప్పటికే స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా చాలా వరకూ తగ్గాయి. తమకు నచ్చిన ఫుడ్డు దొరకకపోవడంతో పాటు డెలివరీ ఆలస్యమవుతుండటంతో ఆర్డర్స్ పెట్టడమే మానుకున్నారని చెబుతున్నారు. దీంతో వేలాది గిగ్ వర్కర్లు పనిలేకుండా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరొకవైపు అత్యవసరంగా వైద్యం అయితేనే హైదరాబాద్ కు రావడం మంచిదన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి. ఇక పర్యాటక రంగం కూడా దాదాపుగా పడకేసింది. ఇప్పటికే హైదరాబాద్ లో పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఉండటంతో బయటకు వచ్చి ఇబ్బంది పడేకంటే ఇంట్లో ఉండటం శ్రేయస్కరమని భావించి చాలా మంది తమ సమ్మర్ ట్రిప్ లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా టిఫిన్లు దొరకక అవస్థలు పడుతున్నారు. మొత్తం మీద గ్యాస్ కొరత దాదాపు చాలా రంగాలను ఆర్థికంగా దెబ్బతీసినట్లే కనిపిస్తుంది.
Next Story

