Sun Feb 08 2026 15:20:14 GMT+0530 (India Standard Time)
Hyderabad : ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు
హైదరాబాద్ నాంపల్లి లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొ రేటరీలో జరిగిన అగ్నిప్రమాదంపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది

హైదరాబాద్ నాంపల్లి లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొ రేటరీలో జరిగిన అగ్నిప్రమాదంపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెంట్రల్ జోన్ పరిధిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు ఎవిడెన్స్‌కు సంబంధించిన కార్యాలయాల్లో అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. వివిధ నేర పరిశోధన కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు, ఫైళ్లు, డిజిటల్ డేటా నిల్వ ఉంచిన విభాగాలే మంటల్లో దగ్ధమైనట్లు అధికారులు గుర్తించారు. స్టోర్ చేసి ఉంచిన మెటీరియల్ మొత్తం కాలిపోయి బూడి దైనట్టు సమాచారం అందుతుంది. ఏ ఏ ఫైళ్లు సమాచారం ఈ ప్రమాదంలో దగ్దమయ్యాయన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
సమగ్ర విచారణకు...
అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు మరికాసేపట్లో తెలియజేయనున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. అయితే, అసలు ఏఏ వస్తువులు తగులబడ్డాయి, ఎంతమేర నష్టం జరిగింది అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో కంప్యూటర్లు, డిజిటల్ ఎవిడెన్స్‌కు సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైళ్లు, ఎవిడెన్స్ ల్యాబొరేటరీ ఆపరేషన్లు ఈ కార్యాలయం నుంచే నిర్వహించేవారని చెప్పారు.
కీలక కేసులపై...
దీంతో ఈ అగ్నిప్రమాదం అనేక కీలక కేసులపై ప్రభావం చూపే అవకాశముందని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని తెలపిారు. తీవ్ర ప్రయత్నాల తర్వాత మంటలు నియంత్రణలోకి వచ్చాయని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాబ్‌లో నలుగురు ఉద్యోగులు ఉన్నారని, మంటలు గమనించిన వెంటనే వారు సురక్షితంగా బయటకు వచ్చినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో అక్కడ పని చేస్తున్న ఒక వార్డు బాయ్ మంటలను గమనించి ఆర్పేందుకు ప్రయత్నించగా స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ప్రమాదమా? లేక విద్రోహమా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది. మరొకవైపు రాజకీయ విమర్శలు కూడా రావడంతో దర్యాప్తును అన్ని కోణాల్లో చేస్తున్నారు.
Next Story

