Fri Dec 05 2025 08:14:19 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : క్రికెట్ లో కిరికిరి.. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంట్రా మావా?
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భ్రష్టుపట్టి పోయింది. అవినీతితో తడిసిపోయింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భ్రష్టుపట్టి పోయింది. అవినీతితో తడిసిపోయింది. ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు బెదిరించడంతో అసలు విషయం బయటపడింది. కక్కుర్తి పడి టిక్కెట్లు ఇవ్వాలంటూ సన్ రైజర్స్ యాజమాన్యాన్నిబెదిరించడంతో తాము హైదరాబాద్ నుంచి తప్పుకుంటామని సన్ రైజర్స్ హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమయి వెంటనే రంగంలోకి దిగి దీనిపై విజిలెన్స్ విచారణతో పాటు సీఐడీ విచారణకు ఆదేశించింది. ఇటీవల సీఐడీ అధికారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారించారు కూడా.
క్రికెట్ తో సంబంధం లేని...
అసలు క్రికెట్ తో ఏమాత్రం సంబంధంలేని, బ్యాట్, బంతి కూడా చూడని వాళ్లు క్రికెట్ అసోసియేషన్ కు పెద్దలుగా మారుతున్నారు. కేవలం రాజకీయ పలుకుబడితోనే వారు పదవులు పొందుతున్నారు. కోట్లలో లాభం. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి ఏ రాజకీయ పార్టీ మారినా, రాష్ట్రం ఏదైనా క్రికెట్ అసోసియేషన్ కు రాజకీయ నాయకులో.. వారి అనుచరులో ప్రెసిడెంట్ లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. వారు క్రికెట్ విషయంలో ఓనమాలు తెలియకపోయినా కోట్లు సంపాదించి తమకు కొంత కమీషన్లు తెచ్చి ఇవ్వడమో.. పార్టీకి ఫండ్ ఇవ్వడమో చేస్తారని వారిని ఎంపిక చేస్తారు. తాజాగా ఈ కేసులో పోలీసు అధికారులు కూడా భాగస్వామ్యులయ్యారంటే క్రికెట్ అసోసియేషన్ ఎంత చెత్తగా తయారయిందో అర్థం చేసుకోవచ్చు.
కీలక నేతకు సమీప బంధువు...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఒక పార్టీలో కీలకమైన నేతకు సమీప బంధువు. అదే సమయంలో కార్యదర్శి దేవరాజ్ పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోట్ల రూపాయలను సంపాదించిందన్న ఆరోపణలున్నాయి. రంజీ ట్రోఫీ నుంచి క్రీడాకారుల ఎంపికలోనూ వీరు చేతివాటం ప్రదర్శిస్తున్నారని విచారణలో తేలింది. అసలు క్రికెట్ అసోసియేషన్ వల్ల ఎవరు నిజంగా ఆటలో పైకి వచ్చారు. సిరాజ్ ఆటో డ్రైవర్ కొడుకు అయినా కష్టపడి పైకి వచ్చి టీం ఇండియాలో చోటుదక్కించుకున్నారు. తిలక్ వర్మ కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చినవారే. వారి కోచ్ లు వేరు. వారు కష్టపడిన తీరు వేరు. కసి, కృషి పట్టుదలతోనే వారు అంత స్థితికిచేరుకున్నారు.
నిబంధనలను మారిస్తేనే...?
నితీష్ కుమార్ రెడ్డి కూడా అంతే. ఇలాంటి సమయంలో క్రికెట్ అసోసియేషన్ తో సంబంధం లేకుండా స్వయంకృషితో ఎదిగిన వాళ్లను స్ఫూర్తిగాతీసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో క్రికెట్ అసోసియేషన్ లో మాజీ క్రికెటర్లకు చోటు కల్పిస్తే కొంత వరకూ ఫలితం ఉంటుందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అప్పటి వరకూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కి చెందిన అనుబంధ సంస్థగా క్రికెట్ అసోసియేషన్ మారక తప్పదు. క్రీడాకారుల తలరాతలు మాత్రం మారవు. అందుకే ఇప్పటికైనా క్రికెట్ అసోసియేషన్ పదవికి అర్హతలు నిర్ధారించాలన్న డిమాండ్ గట్టిగా వినపడుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటేనే గ్రామీణ స్థాయిలో ఉన్న అసలైన ఆణిముత్యాలు వెలుగు చూస్తాయి. లేకుంటే హైదరాబాద్ నుంచి మరో క్రికెటర్ అంతర్జాతీయ స్థాయి ఆటగాడుగా మారడం కష్టమే.
Next Story

