Sat Dec 13 2025 22:35:51 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : మియాపూర్ లో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి ఇద్దరు చిన్నారుల మృతి
హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందారు

హైదరాబాద్ నగరంలోని స్వర్ణపురి కాలనీలోని ‘అర్బన్ రైజ్ స్ప్రింగ్ ఇన్ ది ఎయిర్’ అపార్ట్మెంట్ ఆవరణలో విషాదం చోటుచేసుకుంది. ఆ అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్‌లో ఇద్దరు చిన్నారులు మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంపై ఆందోళనకు దిగారు. మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మృతులుగా బచ్చుపల్లిలోని సూర్య గ్లోబల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల శరగడం ప్రగ్న్య, చందానగర్‌లోని జెనిసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో మూడో తరగతి విద్యార్థిని ఎనిమిదేళ్ల ఆద్విక రెడ్డి గా గుర్తించారు.
స్విమ్మింగ్ పూల్ కు వెళ్లి...
అమీన్పూర్ పోలీసు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, నవంబర్ 2వ తేదీన సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు స్నేహితులు ఆట కోసం తమ కాలనీలోని స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే వారు మునిగిపోయారని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుకన్య అనే మహిళ ఈ విషయాన్ని ప్రగ్న్యా తండ్రి శరగడం శర్మకు కుమార్‌కు తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పిల్లలను స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసి మియాపూర్‌లోని లోటస్ ఆస్పత్రికి తరలించారు. ఆధ్వికారెడ్డి ని క చికిత్స కోసం కొండాపూర్‌లోని హోలిస్టిక్ ఆస్పత్రికి మార్చారు. ప్రగ్యా రాత్రి 11.03 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందింది.
మేనేజ్మెంట్ నిర్లక్ష్యమేనని...
మృతురాలైన ప్రగ్య్నా తండ్రి శర్మకు కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ‘అర్బన్ రైజ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్’పై తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు సంవత్సరాల అడ్వాన్స్ మెయింటెనెన్స్ ఫీజు తీసుకున్నప్పటికీ, స్విమ్మింగ్ పూల్‌లో ప్రాథమిక భద్రతా చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. హెచ్చరిక బోర్డులు లేకపోవడం, పిల్లల భాగం–లోతు నీటి భాగం మధ్య విభజన లేకపోవడం, లైఫ్ గార్డులు లేకపోవడం, లైఫ్ జాకెట్లు లేదా ఫ్లోటింగ్ ట్యూబ్‌లు లేకపోవడం, పూల్ చుట్టూ లైటింగ్ లేకపోవడం వంటి అనేక లోపాలను ఆయన ఫిర్యాదులో వివరించారు. 972 ఫ్లాట్ల సముదాయంలోని నివాసులు పూల్ భద్రతపై పలు మార్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా ఆయన చెప్పారు. మైగేట్ యాప్, ప్రత్యక్ష సమావేశాలు, జనరల్ బాడీ మీటింగ్‌లు, వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్స్ ద్వారా పలుమార్లు సూచించినా స్పందించలేదని ఆరోపించారు.
Next Story

