Mon Nov 17 2025 09:53:35 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. గత కొద్ది గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. గత కొద్ది గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మొదలయిన వాన ఇప్పటికీ పడుతూనే ఉంది. దీంతో హైదరాబాద్ నగర ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షం కురుస్తుండటంతో పలు కాలనీల్లోకి నీరు చేరింది. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావం కారణంగానే వానలు పడతాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. రేపు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చేసిన సూచనతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
అనేక ప్రాంతాల్లో...
మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, బంజారాహిల్స్, మొహిదీపట్నం, టోలిచౌకి, లక్డీకాపూల్, అమీర్ పేట్, కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్, ఆబిడ్స్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఏఎస్ రావు నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.మధ్యాహ్నం భారీ వర్షం మొదలయింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో రహదారులులమయం కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల రహదారులపై మోకాలి లోతు నీరు చేరడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ మూతలు తెరవవద్దంటూ జీహెచ్ఎంసీ అధికారుల కోరుతున్నారు.
పలుకాలనీల్లోకి నీరు...
ఒక్కసారిగా వానలు పడటంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అయితే గాలులు వీయకపోవడంతో ఒకింత అనుకూలమేనని అంటున్నారు. మరొకవైపు పలు కాలనీల్లోకి ఇప్పటికే నీరు చేరింది. అకాల వర్షం కురియడంతో దాదాపు నాలుగు గంటల నుంచి కురుస్తున్న వర్షంతో నగరం తడిసిముద్దయింది. కళాశాలలు, విద్యాసంస్థల నుంచి వచ్చే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇంటికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం మొదలయిన వాన రాత్రికి కూడా వర్షం పడే అవకాశముందని తెలియడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Next Story

