హెడ్ కానిస్టేబుల్ రాజునాయక్‌కు దక్కిన శౌర్యపతకం
Telangana Head Constable Rajunaiak honored with Gallantry Medal for bravely arresting an armed criminal despite life-threatening injuries.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన పతకాల జాబితాలో ప్రతిష్ఠాత్మక శౌర్యపతకం తెలంగాణ కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్‌కు దక్కింది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్త వెంకటాపూర్‌కు చెందిన కట్రావత్ రాజునాయక్ 2006లో కానిస్టేబుల్‌గా చేరారు. 2022లో మాదాపూర్ ఎస్వోటీ విభాగానికి బదిలీ అయ్యారు. 2023 జనవరి 4వ తేదీ అర్ధరాత్రి రాజేంద్రనగర్‌కు చెందిన పాత నేరస్థుడు సర్దార్ కరణ్‌సింగ్, మరొకరు కలిసి మద్యం మత్తులో నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి ఔటర్ సర్వీసు రోడ్డుపై దారిదోపిడీ చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కరణ్‌సింగ్ కత్తితో పొడిచి చంపేశాడు. నిందితుడు జగద్గిరిగుట్టలోని భగవాన్‌సింగ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని రాజునాయక్ సహా ఆరుగురితో కూడిన బృందం వెళ్లింది. రాజునాయక్, వినయ్‌లు కరణ్‌సింగ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు కత్తితో దాడి చేశాడు. వినయ్ తలకు గాయమవ్వగా..రాజు ఛాతీలో కత్తి బలంగా దిగింది. అయినా రాజునాయక్ నిందితుడిని గట్టిగా పట్టుకోవడంతో మిగిలిన కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకున్నారు. రాజు ఊపిరితిత్తుల్లో కత్తి దిగడంతో మూడుసార్లు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ధైర్య సాహసాలు ప్రదర్శించిన రాజునాయక్ కు ప్రతిష్ఠాత్మక శౌర్యపతకం లభించింది.

