Sun Jul 20 2025 01:03:11 GMT+0000 (Coordinated Universal Time)
Sigachi Industry Accident : సిగాచీ పరిశ్రమ ప్రమాదం తర్వాత వెలుగు చూస్తున్న నివ్వెరపోయే నిజాలు
పాశమైలారం లో సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలభై మంది కార్మికులు మరణించారు.

పాశమైలారం లో సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలభై మంది కార్మికులు మరణించారు. అయితే ఇండ్రస్ట్రీస్ శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం అందించిన నివేదిక నివ్వెర పోయేలా చేస్తుంది. గత ఏడాది డిసెంబరు 12వ తేదీన పరిశ్రమ శాఖ అధికారులు సిగాచీ పరిశ్రమను తనిఖీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి ఏటా జరిపే తనిఖీల్లో భాగంగానే సిగాచీ పరిశ్రమను కూడా తనిఖీ చేసినట్లు నివేదికలు తయారు చేశఆరు. నిజామాబాద్ జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్ పెక్టర్ ఈ పరిశ్రమ తనిఖీ చేశారు. అయితే అన్ని భద్రతా ప్రమాణాలున్నాయని ఆయన నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం కొసమెరుపు. అంటే ఆరు నెలల ముందు జరిపిన తనిఖీల్లో అంతా బాగానే ఉందని నివేదికలు ఇచ్చిన అధికారులు చేతులు దులుపుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
పాత కాలం మిషనరీని...
మరొకవైపు కార్మికులు మాత్రం పాతకాలం నాటి మెషనరీని వినియోగిస్తుండటం వల్లనే ప్రమాదం జరిగిందని చెబుతున్నప్పటికీ కార్మిక శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి ఈ పరిశ్రమకు కితాబు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎంత లోతుగా పరిశీలన జరిపారో సంఘటన జరిగిన తర్వాత అర్థమవుతుంది. కేవలం అధికారుల తనిఖీలు జరిగిన ఆరు నుంచి ఏడు నెలల్లోనే భారీ ప్రమాదం సంభవించి నలభై మంది వరకూ ప్రాణాలు కోల్పోయి, పదుల సంఖ్యలో గాయపడ్డారంటే కార్యాలయంలో కూర్చుని నివేదికలు తయారు చేసినట్లు కనపడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. దీంతో పాటు సిగాచీ పరిశ్రమలోని కార్మికుల ఆరోగ్యానికి ముప్పు లేకుండా ఈ పరిశ్రమ అన్ని రకాల నిబంధనలను పాటించిందంటూ ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వడం కూడా అధికారిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తూతూ మంతంగా...
చేతులు తడిపితే అంతా బాగానే ఉంటుంది. లోపాలు కనిపించవు. రికార్డుల్లో మాత్రం అద్భుతహా అని రాసి పాడేస్తారన్నది మరోసారి అర్థమమయింది. రియాక్టర్లు, బాయిలర్లు, డ్రయ్యర్లు వంటి వాటిని పరిశీలించి అధికారులు తనిఖీలు నిర్వహించిన తర్వాత భద్రతా ప్రమాణాలపై నివేదిక రూపొందించాలి. థర్డ్ పార్టీ ఏజెన్సీలు తనిఖీలు చేసి ఇచ్చిన నివేదికలను కర్మాగారాల శాఖ అధికారులు ఓకే చెబుతున్నారు. పాత కాలం మెషనరీతో పరిశ్రమను నడుపుతున్నా అంతా బాగుందన్నదన్న సర్టిఫికేట్ ఇవ్వడంపై ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. సిగాచీ పరిశ్రమ మాత్రమే కాదు అన్ని పరిశ్రమలను ఒకసారి తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు, కార్మికుల ప్రయోజనాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో మరి ఈ తనిఖీల్లోనైనా అసలు విషయాలు వెల్లడిస్తారా? లేదా? అన్నది చూడాలి.
Next Story