Fri Dec 05 2025 12:25:57 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఎనిమిది మంది మృతికి కారణమదేనా?
హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పాతబస్తీలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.

హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పాతబస్తీలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు కూడా చనిపోయినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మీర్ చౌక్ లో ఒక భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బయటకు రాలేకపోయారు. మొత్తం నాలుగు కుటుంబాలు ఈ మంటల్లో చిక్కుకున్నాయి. చార్మినార్ సమీపలోని గుల్జార్ హౌస్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
ఏసీ కంప్రెషర్ పేలిందా?
అయితే ప్రమాదానికి కారణం ఏసీ కంప్రెషర్ పేలిందని కొందరు చెబుతున్నారు. కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మాత్రం దీనిపై ఇంకా నిర్ధారణ చేయలేదు. ఒక హాలులో నాలుగు కుటుంబాలు నిద్రిస్తున్నాయి. చిన్న హాలు.. ఎక్కువ మంది నిద్రలో ఉండగా ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో వారు బయటకు రాలేకపోయారు. కొందరు ఊపిరాడక చనిపోయారని తెలిసింది. మరికొందరు అంటే ముగ్గురు స్పాట్ లోనే సజీవదహనమయినట్లు చెబుతున్నారు.
చిన్న హాలు కావడంతో...
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు. గుల్జార్ హౌస్ లో జరిగిన ఈ ప్రమాదంలో ముప్ఫయి మంది చిక్కుకోగా వారిలో పదహారు మందిని అగ్నిమాపక సిబ్బంది కాపడగలిగారు. గాయపడిన వారు మొత్తం నాలుగు ఆసుపత్రుల్లో వీరు చికిత్స పొందుతున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ ఎక్కువ మంది స్థానికులు గుమి కూడటంతో 108 వాహనాలు వచ్చేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చిన్న హాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా కష్టంగా మారింది.
Next Story

