Fri Dec 05 2025 12:25:39 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఒకే హాలు.. ముప్ఫయి మంది.. నిద్రమత్తులో ఉండగానే ఎనిమిది మంది ఊపిరి ఆగింది
హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మీర్ చౌక్ లో ఒక భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బయటకు రాలేకపోయారు. మొత్తం నాలుగు కుటుంబాలు ఈ మంటల్లో చిక్కుకున్నాయి. చార్మినార్ సమీపలోని గుల్జార్ హౌస్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రిస్తున్నారు. తెల్లవారు జామున కావడంతో ఎక్కువ మంది బయటకు రాలేకపోయారు.
ఒక్కసారిగా మంటలు...
అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో హాలులో ఉన్న వారు బయటకు రాలేకపోయారు. గుల్జార్ హౌస్ లోని మొదటి అంతస్తులోని ఒక హాలులో ముప్ఫయి మంది నిద్రిస్తున్నారు. వీరంతా నాలుగు కుటుంబాలకు చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. అయితే భవనంలోకి రావడానికి, వెళ్లడానికి ఒకే మార్గం ఉండటంతో ప్రమాదం సంభవించిన వెంటనే నిద్రమత్తులో నుంచి లేచి బయటకు రాలేకపోయారు. పొగకు ఊపిరాడక కొందరు మరణించగా, మరికొందరు మాత్రం మంటల్లో సజీవదహన మయ్యారు. అయితే ప్రమాదానికి కారణంపై అగ్నిమాపక సిబ్బంది మాత్రం దీనిపై ఇంకా నిర్ధారణ చేయలేదు. ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. వీరంతా చార్మినార్ ప్రాంతంలో ముత్యాలను విక్రయించి జీవనం కొనసాగిస్తున్నారు.
సహాయక చర్యలు...
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు. గుల్జార్ హౌస్ లో జరిగిన ఈ ప్రమాదంలో ముప్ఫయి మంది చిక్కుకోగా వారిలో పదహారు మందిని అగ్నిమాపక సిబ్బంది కాపడగలిగారు. మృతులను అభిషేక్ (30), ఆరూషీ జైన్ (17), హర్షాలీ గుప్తా (7) , శీతల్ జైన్ (37), రాజేందర్ (67), సుమత్రా( 65) , మున్నీభాయ్ (72) , సిరాజ్ (2) లుగా గుర్తించారు. గాయపడిన వారిని ఒవైసీ ఆసుపత్రి, మలక్ పేట్ యశోద ఆసుపత్రితో పాటు మరో రెండు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ముత్యాల దుకాణం నిర్వహించే యజమానితో పాటు అందులో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబ సభ్యులుకూడా మరణించినట్లు తెలిసింది
Next Story

