Fri Dec 05 2025 21:43:28 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : వినాయక నిమజ్జనం ప్రారంభం... నిఘా నీడలో హైదరాబాద్
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమయింది. దాదాపు యాభై వేల గణనాధులు గణేశ్ నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమయింది. దాదాపు యాభై వేల గణనాధులు గణేశ్ నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 6వ తేదీన ట్యాంక్ బండ్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. సెప్టంబరు 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. అదే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ముంబయి తర్వాత అతిపెద్దగా జరిగే గణేశ్ శోభాయాత్ర హైదరాబాద్ లో మాత్రమే.
అన్ని శాఖలు సంయుక్తంగా...
దాదాపు 303 కిలోమీటర్లు మేరకు కొనసాగనున్న గణేష్ శోభాయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేపట్టింది. నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు జిహెచ్ఎంసి చేసింది. పదమూడు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తుంది. ముప్ఫయి వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. 160 యాక్షన్ టీంలను ఏర్పాటుచేసింది. నగరంలో నిమజ్జనం కోసం నిమజ్జనం కోసం ఇరవై ప్రధాన చెరువులతో పాటు డెబ్భయి రెండు కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసింది. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఉంచింది.
ట్యాంక్ బండ్ వద్ద...
హుస్సేన్ సాగర్ లో తొమ్మిది బోట్లు సిద్ధం చేసింది. 200 మంది గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉంచారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసింది. 6న 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అంచనా వేస్తున్న అధికారులు అందుకు ఏర్పాట్లను పూర్తిచేశారు. ఖైరతాబాద్ భారీ గణేష్ నిమజ్జనం ఆరో తేదీ మధ్యాహ్నానికి పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు అందుకు తగినట్లుగా చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యమయ్యే పని అనిపించడం లేదు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేశారు.
బాలాపూర్ గణేశుడితో మొదలై...
తొలుత బాలాపూర్ గణేశుడి కదలిక ద్వారా శో్భాయాత్ర ప్రారంభం కానుంది. బాలాపూర్ గణేశుడితో పాటు వందల సంఖ్యలో వినాయక విగ్రహాలు పాతబస్తీ మీదుగా కొనసాగుతాయి. అందుకే పాతబస్తీలో అదనపు బలగాలను మొహరించారు. ప్రార్ధనలు జరిగే సమాయానికి శోభాయాత్ర పాతబస్తీ దాటేలా పోలీసులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. వేల సంఖ్యలో గణనాధులు, లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరొకవైపు గణేశ్ శోభాయాత్రకు పోలీసులు మరింత పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు.
Next Story

