Tue Jan 20 2026 15:44:55 GMT+0000 (Coordinated Universal Time)
దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో చిన్నారి మృతి
దోమలగూడలో నివాసం ఉంటున్న పద్మ బోనాల పండుగ సందర్భంగా కూతురు-అల్లుడు, బంధువులను మూడురోజుల..

దోమలగూడలో మంగళవారం పద్మ అనే మహిళ బోనాలు పండుగ సందర్భంగా పిండి వంటలు చేస్తుండగా.. గ్యాస్ లీకై ప్రమాద వశాత్తు పేలింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలవ్వగా వారందరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చిన్నారి శరణ్య (6) 30 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరో ఆరుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమలగూడలో నివాసం ఉంటున్న పద్మ బోనాల పండుగ సందర్భంగా కూతురు-అల్లుడు, బంధువులను మూడురోజుల క్రితమే ఇంటికి ఆహ్వానించింది. బోనాల పండుగ నేపథ్యంలో ఇల్లంతా సందడిగా మారింది. ఉదయం ఇంట్లో పిండివంటలు చేస్తుండగా.. గ్యాస్ లీకై సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించాయి.
ఆ సమయంలో ఇంటిలో ఉన్న ఏడుగురికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు మంటలు ఆర్పివేసి పద్మ కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడుగురిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని దోమలగూడ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. విషమంగా ఉన్నవారిలో అభినవ్ (8), శరణ్య (6), విహార్ (3) ముగ్గురు చిన్నారులు ఉండగా.. శరణ్య చికిత్స పొందుతూ మృతి చెందింది.
Next Story

