Fri Dec 05 2025 09:33:13 GMT+0000 (Coordinated Universal Time)
Sigachi Industry Accident : ఆ ఎనిమిది మంది పరిస్థితి ఇక అంతేనా? మృతుల సంఖ్య పెరుగుతోంది
సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో మృతుల సంఖ్య నలభై ఐదుకు చేరింది

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో మృతుల సంఖ్య నలభై ఐదుకు చేరింది. చికిత్స పొందుతున్న వారు ఇంకా మరణిస్తూనే ఉన్నారు. గత నెల 30వ తేదీన సిగాచీ రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు పూర్తిగా నిలిపివేశారు. కర్మాగారాన్ని కూడా మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అయితే ఎనిమిది మంది కార్మికుల జాడ మాత్రం ఇంత వరకూ దొరకలేదు. ప్రమాదం జరిగి దాదాపు పదిహేను రోజులు దాటుతున్నప్పటికీ ప్రమాదం సమయంలో కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది దొరకకపోవడంతో వారు కుటుంబ సభ్యులు కూడా ఆశలు వదులుకుని వారి సొంత ఊళ్లకు వెళ్లిపోయారు.
కాలి బూడిదయి ఉంటారని...
జాడ తెలియని ఆ ఎనిమిది మంది కాలి బూడిదయిపోయి ఉంటారని, అందుకే కనీసం శరీరభాగాలు కూడా దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. తప్పిపోయిన వారిని రాహుల్, రవి, వెంకటేవ్, ఇర్ఫాన్, విజయ్, అఖిలేశ్, జస్టిన్, శివాజీలుగా గుర్తించారు. కానీ చివరి చూపు కూడా దక్కకుండా, కనీసం వారి అస్థికలను కూడా నిమజ్జనం చేయడానికి లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. పది హేను రోజులు దాటుతుండటంతో సహాయక కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైనా సమాచారం అందితే తాము మళ్లీ పిలుస్తామని ఎనిమిది మంది కి సంబంధించిన కుటుంబ సభ్యులను వారి స్వస్థలాలకు పంపించి వేశారు.
మరొకరు మరణించడంతో...
కాగా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరొక కార్మకుడు మరణించాడు. పశ్చిమబెంగాల్ కు చెందిన తరపాడుతుడు అనే కార్మికుడు మదీనాగూడలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మరణించిన వారి సంఖ్య నలభై ఐదుకు చేరింది. అక్కడ లభించిన మానవ శరీర భాగాలను డీఎన్ఏ రిపోర్టుల కోసం పంపినా అందులో కూడా తేలలేదు. దాదాపు 70 వరకూ నమూనాలను సేకరించి పంపారు. కాగా నలుగురు సభ్యులతో పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక సమర్పించడానికి ఇంకా పదిహేను రోజులు మాత్రమే సయం ఉంది. మరి కమిటీ నివేదికలో ప్రమాదానికి గల కారణం తెలుస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story

