Fri Dec 05 2025 09:33:00 GMT+0000 (Coordinated Universal Time)
సిగాచీ పరిశ్రమలో మృతుల సంఖ్య 39... ఇంకా ఎంత మందో?
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 39 మందికి చేరింది.

పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 39 మందికి చేరింది. నలభై మూడు మంది ఆచూకీ కనిపించడం లేదు. నిన్న ఉదయం ప్రారంభమయిన రెస్క్యూ పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. భవనం పేలుడు ధాటికి కూలి పోవడంతో శిధిలాల కింద ఎక్కువ మంది ఉంటారని, మరో ఇరవై మంది వరకూ ఉంటారని చెబుతున్నారు. కంపెనీ యాజామాన్యం కూడా నలభై మూడు మంది కార్మికుల జాడ కనిపించడం లేదని తెలిపింది. 39 మంది ఇప్పటి వరకూ మరణించినప్పటికీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతన్నారు. గల్లంతయిన వారు ఇక జీవించే అవకాశం లేదని అక్కడ రెస్క్యూ పనులు చేపట్టిన అధికారులు చెబుతున్నారు.
108 మంది కార్మికులు...
నిన్న ఉదయం సిగాచీ ఫస్ట్ షిఫ్ట్ లో రియాక్టర్ పేలడంతో కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సహాయకచర్యలు వెంటనే ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 108 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. 32 మంది వరకూ ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలోనే 35 మృతదేహాలున్నాయి. వీరంతా బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు అత్యధికంగా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు తక్కువగానే ఉన్నారు. మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులున్నారు. వారి కుటుంబీకులను రప్పించి మృతదేహాలను గుర్తుపట్టే కార్యక్రమాన్ని చేపట్టారు.
శిధిలాల వెలికి తీత...
సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ పదహారుగురు మరణించారు. పేలుడు ధాటికి శరీరంలో ఎనభై శాతం వరకూ గాయాలు కావడంతో చివరకు తుది శ్వాస విడిచారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి భవనాల శిధిలాలు తగిలి గాయాలయ్యాయి. మరికొందరు శిధిలంగా ఉన్న భవనం కింద ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంకా శిధిలాల వెలికితీత కార్యక్రమం కొననాగుతుంది. కార్మికులతో పాటు కంపెనీలో పనిచేస్తున్న ఆఫీసర్లు కూడా మరణించారు. సంగారెడ్డిలో మృతుల కుటుంబాల కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. తమ వారు కనిపించడం లేదంటూ కార్మిక కుటుంబాలు వచ్చి అక్కడ పేర్లు నమోదు చేస్తున్నాయి. ఆ నలభై మూడు మంది ఎక్కడన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Next Story

