Wed Mar 26 2025 07:35:24 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం.. బోసిపోయిన వీధులు
నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది

నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే. అందులోనూ ఆదివారం రావడంతో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతారు. హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారనుంది. కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ లోకి భారత్ రావడంతో క్రికెట్ అభిమానులందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు సమ ఉజ్జీలు పోటీ పడుతుండటంతో ఆసక్తికరంగా తిలకించేందుకు టీవీల వద్ద ఎక్కువ మంది అభిమానులు కూర్చుని ఈ ఫైనల్స్ ను చూడనున్నారు. మెట్రో రైళ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి.
సొంత వాహనాలతో...
ఆదివారం నాడు ఆటవిడుపు. ఎక్కువ మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనాల్లో బయటకు వస్తారు. వారంలో ఆరు రోజులు విధులు నిర్వహించి సెలవు రోజు కాస్త ఆటవిడుపుగా పార్కులు, దర్శనీయ స్థలాలను సందర్శించడం పరిపాటిగా మారింది. అందుకే ఆదివారం కూడా హైదరాబాద్ లో రద్దీ తగ్గదు. సొంత వాహనాలన్నీ బయటకు రావడంతో ట్రాఫిక్ ఎప్పటి లాగానే ఉంటుంది. ఇక భోజన ప్రియులు తమకు ఇష్టమైన ఆహారాన్ని తినేందుకు బయటకు వచ్చి హోటళ్లను ఆశ్రయిస్తారు. కానీ నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుండటంతో ఇక కుటుంబ సభ్యులతో కలసి బయటకు రావడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడటం లేదు.
మధ్యాహ్నం నుంచి...
మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారనుంది. పాకిస్థాన్ తో భారత్ ఆడిన మ్యాచ్ ఆదివారం నాడు జరగడంతో ఆరోజు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫైనల్స్ కావడంతో ఇదే పరిస్థితి ఈ సండే కూడా ఉండవచ్చన్న అంచనా ఉంది. దీంతో పాటు హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లు, బార్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఫైనల్ మ్యాచ్ ను తమ వద్దనే చూసేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కొందరు స్నేహితులతో కలసి రెస్టారెంట్లకకు వెళ్లే అవకాశముంది. మొత్తం మీద మధ్యాహ్నం ఒంటి గంట నుంచే హైదరాబాద్ నగరంలో వీధులు బోసి పోయి కనిపిస్తాయన్నది వాస్తవం. అత్యవసర పరిస్థితులతో బయటకు వచ్చే వారు, క్రికెట్ అంటే ఇష్టం లేని వారు మాత్రమే బయట నేడు కనిపించనున్నారు.
Next Story