Fri Dec 05 2025 18:52:20 GMT+0000 (Coordinated Universal Time)
Balapur Laddu : బాలాపూర్ లడ్డూ వేలం హిస్టరీ ఇదీ.. 450 రూపాయలతో ప్రారంభమై
బాలాపూర్ లడ్డూ గణేశుడి వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలానికి మూడు దశాబ్దాల చరిత్ర ఉంది.

బాలాపూర్ లడ్డూ గణేశుడి వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలానికి మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ వేలం ప్రక్రియ 1994లో ప్రారంభమయింది. 1994లో రైతు కొలను మోహన్ రెడ్డి బాలాపూర్ లడ్డూను 450 రూపాయలకు దక్కించుకున్నారు. తర్వాత ఆ లడ్డూను తోటివారికి పంచడంతో పాటు తన పొలంలో చల్లడంతో కొలను కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది. దీంతో ఈ బాలాపూర్ లడ్డూ వేలం సెంటిమెంట్ గా మారింది. 1994లో ప్రారంభమయిన లడ్డూ వేలం 450 రూపాయలతో ప్రారంభమై గత ఏడాది 30.01 లక్షల రూపాయలకు చేరుకుంది. ఈసారి లడ్డూ వేలంలో దాదాపు 38 మంది భక్తులు పాల్గొంటున్నారు.
దీనిని చూసిన తర్వాతనే...
బాలాపూర్ లడ్డూ వేలాన్ని చూసిన తర్వాతనే హైదరబాద్ లోని మిగిలిన మంటపాల్లోనూ లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభమయింది. గేటెడ్ కమ్యునిటీల్లోనూ, అపార్ట్ మెంట్లలోనూ, కాలనీల్లోనూ లడ్డూ వేలాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఖైరతాబాద్ గణేశుడి చేతులో ఉన్న లడ్డూను మాత్రం వేలం వేయరు. ఆ లడ్డూను భక్తులకు ప్రసాదం రూపంలో పంచుతారు. బాలాపూర్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన ఆదాయంతో తిరిగి గణేశుడి ఏర్పాట్లు, గ్రామ అభివృద్ధికి కమిటీ ఖర్చు చేస్తుంది. రాష్ట్రంలో ఎన్ని లడ్డూలు వేలం జరుగుతున్నప్పటికీ బాలాపూర్ లడ్డూది మాత్రం ప్రక్రియ అని చెప్పాలి. మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న లడ్డూ వేలాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు.
కొలను కుటుంబమే అత్యధిక సార్లు...
బాలాపూర్ లడ్డూ 1994లో 450 రూపాయలతో ప్రారంభమై ఇప్పుడు లక్షలకు చేరుకుంది. 2023లో దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను ఇరవై ఏడు లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. 2024లో కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూను 30,01,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూను అత్యధికంగా ఇప్పటి వరకూ కొలను కుటుంబం చేజిక్కించుకోవడం విశేషం. ఈసారి కూడా కొలను కుటుంబం లడ్డూ వేలంలో పాల్గొంటుంది. అయితే బాలాపూర్ లడ్డూవేలం ధర గత ఏడాది ధర కంటే అత్యధికంగా అంటే మరో రెండు మూడు లక్షలకు మించి వేలం పాటను పోనివ్వరు. ఈసారి రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూ వేలం జరుగుతుందని అంటున్నారు. పురవీధుల్లో తిరిగిన తర్వాత మరికాసేపట్లో లడ్డూ వేలం పాట ప్రక్రియ ప్రారంభం కానుంది.
Next Story

