Fri Mar 06 2026 11:40:40 GMT+0530 (India Standard Time)
Summer Tips : ఎండ ప్రభావానికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే.. చెమటలు పట్టిస్తున్నాడు. బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు. ఏప్రిల్, మే లో భానుడు మరింత భగ్గుమనే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్లో పేర్కొందని విపత్తుల సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.
మార్చినెలలోనే...
మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉందని అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కవ రోజులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. మార్చి నుంచి మే నెల వరకు చూసుకుంటే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ప్రాణ నష్టం జరగకుండా...
విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండతీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. జిల్లాయంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుందన్నారు. ఎండ తీవ్రత అంచనాల నేపధ్యంలో జిల్లా అధికారులు దృష్టి సారించాలని ఇప్చటికే సూచనలు జారీ చేశామన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై పర్యవేక్షిస్తామన్నారు. జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు, వడగాల్పులు, ఎండ తీవ్రతపై సూచనలు జారీచేయనున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ లో ఎండ ప్రభావం చూపే మండల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు. ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు.ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడనున్నందున చెట్ల క్రింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణలోనూ ఎండల తీవ్రత...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాల్లో ముప్ఫయి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయని, కొన్ని జిల్లాల్లో 38 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అలాగే ఉక్కపోతతో పాటు వేడిగాలులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఈ నెల రెండో వారంలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశముందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.అందుకే పగటి వేళ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండలకు బయటతిరగడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రేషన్ కు గురి కాకుండా తగినం మంచినీటిని తీసుకోవాలని కోరారు.
సమ్మర్ టిప్స్
ఎండ ప్రభావానికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాల మీదకు ముప్పు ఏర్పడుతుంది. డిగాలులు.. వడదెబ్బ ముప్పు నుంచి కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఈ మార్చి నెల మొదటి వారం నుంచే సూర్యుడు చుర్రుమనిపిస్తున్నాడు. ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రం కానున్నాయి. ఉదయం 10గంటలకే ప్రతాపం చూపుతున్న సూరీడు మధ్యాహ్నం సమయంలో చెమటలు కక్కిస్తున్నాడు. వేడి ఉక్కపోత పెరుగుతాయి. అందుకే అడుగు బయట పెట్టాలంటనే జనం భయపడుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే బైటికెళ్లి ఏ పని చేసుకోవాలన్నా కష్టమే. అతిచెమట కాకుండా వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంది. సూర్యకిరణాల వేడిని భరించలేక శరీరంలో ఏర్పడే ఇంబాలెన్స్ వల్ల వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు. దీన్నే 'వడదెబ్బ' అంటారు.
వడదెబ్బ లక్షణాలివీ...
ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులే ఎక్కువగా వడదెబ్బకు గురవు తుంటారు. వీరేకాక దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు, ఊపిరితిత్తులు, గుండె, జీర్ణకోశ, మూత్రకోశాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు ఎండలో పనిచేసేవారు, స్థూల కాయులు, వాతావరణంలోని మార్పులకి తట్టుకోలేనివారు, శరీరంలో నీటిశాతం తగ్గిన వారు, అధిక శారీరక, మానసిక శ్రమచేసేవారు ప్రత్యక్షం గానో, పరోక్షంగానో వేసవి తాపానికి గురి అవుతారు. వడదెబ్బ కేసుల్లో పదింట ఒక్కరు మరణించడం జరుగుతున్న కారణంగా ఇది అంత తేలికగా తీసివేయవలసిన సమస్య కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ వల్ల మెదడులో కంజేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల బలహీనత, తలనొప్పి, తలతిప్పటం, నోట్లో నీరు ఊరడం, వాంతులు, శరీరం తూలినట్లుండడం, మైకం రావడం, మెంటల్ కన్ఫ్యూజన్, అస్థిమితం, అమిత దాహం, కండరాలలో క్రాంప్స్, అధిక చెమటలు, మెదడులోని సెరిబ్రో స్పైనల్ ద్రవంలో ప్రెషర్ పెరగడం వల్ల నాడీ మండలం దెబ్బతిని రోగి స్పృహ కోల్పోతాడు. ఒక్కోసారి రక్తస్రావం, లివర్, హెపాటిక్ ఫెయిల్యూర్, షాక్ వల్ల మరణం కూడా సంభవిస్తుంది. జీర్ణక్రియ లోపాల వల్ల కడుపుబ్బరం, విరేచనాలు, అపానవాయువు లెక్కువగా పోవడం, వాంతులు కావడం, పోషకాహార లోపం, డీహైడ్రేషన్ వంటి లక్షణాలేర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
వడదెబ్బ - ముఖ్య లక్షణాలు
శరీర ఉష్ణోగ్రత: జ్వరం 104-106 డిగ్రీల ఫారన్హీట్ వరకు ఉంటుంది. నాడి వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. నిమిషానికి 20-40 సార్లు ఉచ్ఛ్వాస, నిశ్వాస లుంటాయి. రోగి ఆందోళనగా, నిర్లిప్తంగా, నీరసంగా ఉంటారు. మానసిక స్థితి: తలతిరగడం, వాంతులు, మగత, ఫిట్స్ లేదా స్పృహ కోల్పోవడం. చెమట పట్టకపోవడం, విపరీతమైన దాహం, కండరాల నొప్పులు వంటివి వడదెబ్బ ముఖ్య లక్షణాలని అంటున్నారు. వడదెబ్బ నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలుతీసుకోవాలని
తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ ....
వడదెబ్బత తగిలిన బాధితుడిని వెంటనే నీడలోకి లేదా చల్లని ప్రదేశానికి చేర్చాలి. దుస్తులను వదులు చేసి, శరీరంపై చల్లటి నీరు చిలకరించాలి. చికిత్స ప్రారంభించే ముందు వడదెబ్బ తగిలిన వ్యక్తి వయసు, ఎండ తీవ్రత, రోగి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి లక్షణాల్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ నీళ్లు తరచుగా తీసుకోవాలి. ఎండలో బయట తిరిగి వచ్చిన వెంటనే నీళ్లు తాగకుండా, 10-15 నిమిషాల విశ్రాంతి తర్వాతే తీసుకోవాలి.
తాటి ముంజలు, గంజి వంటి చలవ చేసే పదార్థాలు మరియు పోషకాహారం తీసుకోవాలి.
వేసవిలో తీసుకోవాల్సిన పోషకాహారమిదీ
ఎండకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం.
నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు: పుచ్చకాయ, కర్బూజ, నారింజ, మరియు ద్రాక్ష వంటివి శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి.
పెరుగు లేదా మజ్జిగ శరీరానికి చలువ చేయడమే కాకుండా ప్రోబయోటిక్స్ వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో తీసుకోవడం వల్ల వడదెబ్బ తగలకుండా రక్షణ లభిస్తుంది.
నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది.
Next Story

