Tue Apr 07 2026 11:23:22 GMT+0530 (India Standard Time)
Mango: ఈ మామిడి పండు తింటున్నారా? అయితే మీరు ట్రబుల్ లో పడినట్లే
మామిడి పండు పండ్లలో రారాజు

మామిడి పండు పండ్లలో రారాజు. మామిడి పండ్లకు ఉన్న ప్రత్యేకత ఏ పండుకు ఉండదు. అంతటి తియ్యదనంతో పాటు వేసవి కాలం వస్తుందంటే మామిడి పండు కోసం వృద్ధుల నుంచి చిన్నారుల వరకూ ఆశతో ఎదురు చూస్తుంటారు. వేసవి కాలం వచ్చింది.. మామిడి పండ్ల సీజన్ మొదలైంది. నిగనిగలాడే రంగును చూసి మోసపోతే మనం ఆరోగ్యానికి ముప్పు కొని తెచ్చుకున్నట్టే. అన్నీ మామిడి పండ్లు కావు. రంగు చూసి కొంటే కొన్ని సార్లు విషం కొన్నట్టే. మార్కెట్లో విరివిగా రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లు కొని తింటే ఆరోగ్యానికి హానికరం.
ఆరోగ్య సమస్యలివీ...
విరివిగా ఇథలిన్, నిషేధిత కాల్షియం కార్టెడ్ వినియోగం వలన దీర్ఘకాలంలో చర్మ, శ్వాసకోశ, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. సాధారణంగా మామిడి కాయ పది నుంచి పన్నెండు రోజుల్లో పండుగా మారుతుంది. అయితే, ఇథలిన్, కాల్షియం కార్బైడ్ వల్ల పచ్చికాయలు కేవలం రెండు, మూడు రోజుల్లోనే పసుపుపచ్చ రంగులోకి మారిపోతాయి. రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లను గుర్తించడానికి మరియు ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఈ ముఖ్యమైన సూచనలు పాటిల్సిందే.
ఎలా గుర్తించాలంటే...
పండు మొత్తం ఒకే రకమైన పసుపు రంగులో ఉండి, అక్కడక్కడ పచ్చని చుక్కలు కూడా లేకుండా ఉంటే అది రసాయనాలతో పండినట్టు అనుమానించాలి. సహజంగా పండిన పండులో పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కలిసి ఉంటాయి.రుచి మరియు వాసనలో కూడా తేడా ఉంటుంది. కృత్రిమంగా పండిన పండ్లకు అసలైన మామిడి వాసన ఉండదు. తిన్నప్పుడు కూడా నోటిలో కొద్దిగా మంట అనిపించవచ్చు లేదా రుచి చప్పగా ఉంటుంది.నీటి పరీక్ష ద్వారా అసలు.. నకిలీ మామిడి పండు ఏదన్నది తెలుసుకోవచ్చు. ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండ్లు నీటిలో మునుగుతాయి. రసాయనాలతో పండించినవి నీటిపై తేలుతాయి పండు పైన పచ్చగా ఉన్నా లోపల గుజ్జు లేత పసుపు లేదా తెల్లగా ఉంటే అది ఖచ్చితంగా రసాయనాల వాడకమే.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
మార్కెట్ నుండి తెచ్చిన పండ్లను కనీసం 15-20 నిమిషాల పాటు ఉప్పు లేదా బేకింగ్ సోడా కలిపిన నీటిలో ఉంచాలి. ఇది పైన ఉన్న రసాయనాల తీవ్రతను తగ్గిస్తుంది.
మామిడి పండును తొక్కతో సహా తినకుండా, తొక్కను పూర్తిగా తీసేసి తినడం సురక్షితం.
వీలైనంత వరకు నేరుగా రైతుల వద్ద లేదా గుర్తింపు పొందిన ఆర్గానిక్ స్టోర్స్ నుండి కొనుగోలు చేయడం ఉత్తమం.
ముందే వచ్చే పండ్లు రసాయనాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువ. సీజన్ ఊపందుకున్న తర్వాత సహజంగా పండిన పండ్లు దొరికే అవకాశం ఉంటుంది.అందుకే రోడ్ల వెంట మామిడి పండ్లను కొనుగోలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. కాల్షియం కార్బైడ్ మరియు అధిక మొత్తంలో ఇథలిన్ వాడకం వల్ల దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కొనే ముందు ఒక నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు.
Next Story

