Sun Oct 06 2024 01:40:08 GMT+0000 (Coordinated Universal Time)
మీరు రాత్రుల్లో ఎక్కువగా మెలకువగా ఉంటున్నారా? ఈ వ్యాధి రావచ్చు!
ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేసేవారు చాలా మంది ఉన్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా ఆరోగ్యంపై..
ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేసేవారు చాలా మంది ఉన్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా ఆరోగ్యంపై పెద్దగా పట్టించుకోవడం లేదు. విశ్రాంతి అనేది లేకుండా పోతోంది. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. రోజురోజుకు మధుమేహగ్రస్తులు పెరిగిపోతున్నారు. కారణం ఏంటంటే జీవనశైలిలో మార్పులు. వివిధ రకాలుగా ఒత్తిడికి గురవడం, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి వివిధ జబ్బుల బారిన పడుతున్నాడు. ఈ సమస్యలు ఉంటే మధుమేహం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరికి నిద్ర అనేది చాలా ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే వివిధ వ్యాధులు వచ్చి చేరుతాయి.
తాజా పరిశోధనలో సంచలన నిజాలు:
తాజాగా నిద్రపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. రాత్రుల్లో ఎక్కువగా మెలకువగా ఉండే వారికి టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఇతర వ్యక్తులతో పోలిస్తే అర్థరాత్రి వరకు మెలకువగా ఉండే వ్యక్తులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన అంశాలన్ని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.
60 వేల మహిళా నర్సులపై పరిశోధన..
కాగా, హార్వర్డ్ మెడిసిన్ స్కూల్ పరిశోధకులు 60 వేల మంది మహిళా నర్సులపై అధ్యయనం చేశారు. రాత్రిపూట పనిచేసే నర్సుల్లో వ్యాయమం సరిగ్గా ఉండటం లేదని, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది. ఈ కారణాల వల్ల వీరి జీవనశైలిపై తీవ్ర ప్రభావం పడిందని రుజువైంది. పగటిపూట పనిచేసే వారితో పోలిస్తే రాత్రిపూట మేల్కొని పనిచేసే వ్యక్తులకు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 19 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి, పగటిపూట నిద్రపోయే వారి నిద్ర చక్రం చెదిరిపోతుందన్న పరిశోధకులు.. దీని కారణంగా శరీరంలోని జీవక్రియ వ్యవస్థ క్షీణిస్తుందని వెల్లడించారు. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి టైప్ 2 డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. పరిశోధనలో శాస్త్రవేత్తలు రాత్రి ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు, తెల్లవారుజామున నిద్రపోయే వ్యక్తుల కొవ్వు జీవక్రియలో చాలా తేడా ఉందని కనుగొన్నారు.
టైప్ 2 డయాబెటిస్ అంటే ఏమిటి?
డయాబెటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి – టైప్ 1, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 మధుమేహం చాలా మందిలో జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది. అలాగే టైప్ 2 మధుమేహం ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో అవాంతరాల వల్ల వస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ అవసరానికి అనుగుణంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మహిళలకు మధుమేహం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ బృందం వైద్య రికార్డులను కూడా పరిశీలించింది.
Next Story