Tue Jan 14 2025 02:58:14 GMT+0000 (Coordinated Universal Time)
Haryana Elections: హర్యానాలో ఈసారి గెలుపు ఆ పార్టీదేనా? జనం నాడి ఏం చెబుతోంది?
హర్యానాలో ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేసి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి
హర్యానాలో ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేసి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అగ్రనేతలు కూడా హర్యానాలో పర్యటిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మ్యానిఫేస్టో బలంగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రధానంగా హర్యానాలో ఈసారి కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొని ఉందని చెప్పకతప్పదు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా అధికారంలోకి వచ్చేటంత సీట్లు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటుంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కానుంది.
హ్యాట్రిక్ విజయం కోసం...
వచ్చే నెల 1వ తేదీన హర్యానా శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. అక్టోబరు 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. వరసగా రెండు విడతలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుకుంటుంది. అందుకోసం ప్రజలను ఆకట్టుకునే విధంగా మ్యానిఫేస్టోను రూపొందించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ ప్రజల్లోకి చొచ్చుకెళుతుంది. అదే సమయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం తమకు అధికారాన్ని అప్పగిస్తే నాయబ్ సింగ్ సైనీని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. ఇలా బీజేపీ అనేక వ్యూహాలతో హర్యానా ఎన్నికలకు వెళుతుంది.
కాంగ్రెస్ నమ్మకం ఇదే...
కాంగ్రెస్ కూడా హర్యానా ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత తమ విజయానికి కారణమవుతుందని గట్టిగా కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. సీనియర్ నేతలను పరిశీలకులుగా దింపడమే కాకుండా అగ్రశ్రేణి నేతలు తమ పార్టీ తరుపున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పదేళ్ల కమలనాధుల పాలన నుంచి ప్రజలు విముక్తి కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పడమే మార్గమమని ప్రధానంగా ప్రచారంలో పేర్కొంటుంది. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెబుతుంది. ప్రధానంగా రైతులను కేంద్రప్రభుత్వం మభ్యపెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి వారు తమ వైపు మొగ్గు చూపుతారని విశ్వసిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది. మరి ఎవరిది గెలుపు అన్నది మాత్రం అక్టోబరు 4వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.
Next Story