Fri Dec 05 2025 12:48:00 GMT+0000 (Coordinated Universal Time)
Vinayaka Chavithi : చవితిని ఇలా చేసుకోండి.. ఆ వస్తువులను మాత్రం విస్మరించకండి
ఈరోజు వినాయక చవితి పండగను దేశమంతా జరుపుకుంటున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశుడికి పూజలు చేస్తున్నారు

ఈరోజు వినాయక చవితి పండగను దేశమంతా జరుపుకుంటున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశుడికి పూజలు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒక గణేశుడి విగ్రహం ప్రతిష్టించి పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ గణేశ్ చతుర్థిని అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు ఆనందంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించి మట్టి వినాయకుడితో పాటు వినాయకుడిని పూజకు ఉపయోగించే పత్రిని కొనుగోలు చేస్తారు. వివిధ రకాల ఆకులు, పండ్లతో గణేశ్ ను పూజించడం ఈ పండగ విశిష్టత. వినాయకుడికి అత్యంత ఇష్టమైన పిండి వంటలను తయారు చేసి భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించనున్నారు.
పత్రి శాస్త్రీయంగా...
వినాయక చవితి రోజు చేసే పూజకు వినియోగించే పత్రిలో కేవలం పూజమాత్రమే కాకుండా శాస్త్రీయత కూడా ఉందని పూర్వీకులు చెబుతారు. గతంలో గ్రామాల్లోని పొలాలలకు వెళ్లి పత్రిని సేకరించి తెచ్చేవారు. తోటలు, అడవులకు వెళ్లి పత్రిని సేకరించడం నాటి యువతకు ఒక అలవాటు. ఆనందంగా యువకులు అందరూ కలసి వెళ్లి పత్రిని సేకరించి ఇంటికి తెచ్చేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణీకరణ పెరగడంతో పత్రిని విక్రయించడం మొదలు పెట్టిన తర్వాత గ్రామాల్లోనూ ఆ అలవాటు తప్పింది. వినాయకుడికి ఈ వస్తువులు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా పండితులు చెబుతారు. అందుకే గణేశ్ పూజలో ఈ వస్తువులు ఉండాల్సిందేనంటారు.
ప్రీతిపాత్రమైనవి...
వినాయకుడికి అత్యంత ఇష్టమైన ఉండ్రాళ్లు చేసి ఆయనకు నైవేద్యంగా పెట్టడం ప్రతి ఇంట్లోనూ, మండపంలోనూ జరుగుతుంది. ఆ తర్వాత దానిని ప్రసాదంగా అందరూ స్వీకరిస్తారు. దీనిని స్వీకరిస్తే ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. వినాయకుడికి కుడుములు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఇది కూడా నైవేద్యంగా పెడతారు. ఇక గణేశుడి పూజలో వినియోగించే పత్రిలో దర్భను ఉపయోగిస్తారు. ఇది గణేశుడికి అత్యంత ఇష్టమైన వస్తువు. అరటిపండును కూడా నైవేద్యంగా పెట్టి తీరాలని పండితులు చెబుతున్నారు. వినాయకుడికి కుంకుమతో పూజ చేయడం శుభప్రదమంటారు. వినాయకుడికి పత్రి ఎంత ఇష్టమో పూలు కూడా అంతే ఇష్టం. పసుపు రంగు పూలతో పాటు మొగలి పూలను కూడా ఆయన పూజలో వినియోగిస్తారు. వీటితో పూజను ముగించిన తర్వాత గశేశుడికి ఇష్టమైన నైవైద్యం సమర్పించాలి. వినాయక వ్రత మహాత్యం కధను చదివితే ఎంతో శుభప్రదమని అందరూ భావిస్తారు. విద్యార్థులు తమ పుస్తకాలను అక్కడ ఉంచి ప్రార్థిస్తే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారని నమ్ముతారు.
Next Story

