Mon Jun 16 2025 19:09:21 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో ఆపరేషన్ సింధూర్ తర్వాత దుబాయ్‌లో జరిగిన పోటీ ని చూపడం లేదు, 2016 నాటిది
ఒక మహిళా రెజ్లర్ తనతో పోరాడాలంటూ ప్రేక్షకులను సవాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాకిస్తాన్ రెజ్లర్

Claim :
ఆపరేషన్ సింధూర్ తర్వాత దుబాయ్‌లో జరిగిన పోటీలో భారత రెజ్లర్ కవితా విజయలక్ష్మి పాకిస్తాన్ రెజ్లర్‌ను ఓడించిందిFact :
ఇద్దరు రెజ్లర్లు భారతదేశానికి చెందినవారు. ఈ వీడియో 2016 సంవత్సరం లో CWE నిర్వహించిన జలంధర్ ఈవెంట్లో చోటు చేసుకున్న ఘటన చూపిస్తోంది
ఒక మహిళా రెజ్లర్ తనతో పోరాడాలంటూ ప్రేక్షకులను సవాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో పాకిస్తాన్ రెజ్లర్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులలో ఉన్న భారతీయ మహిళలను ఎగతాళి చేస్తూ సవాలు చేస్టోఅంది అన్న వాదన తో వైరల్ అవుతోంది. ప్రేక్షకులలో ఒక మహిళ సల్వార్ కమీజ్ ధరించి రింగ్‌లోకి ప్రవేశించి ఆమెతో పోరాడి చివరికి ఆమెను ఓడించింది. ఆ సవాలును స్వీకరించి తన బలాన్ని చూపించిన మహిళ భారతీయ అమ్మాయి కవితా విజయలక్ష్మి అని ప్రచారం చేస్తున్నారు. దుబాయ్‌లో నిర్వహించిన పోటీలో పాకిస్తాన్ మహిళా రెజ్లర్ వేదికపై నుండి భారతీయులను అవమానించిందని, కానీ భారతదేశానికి చెందిన మహిళ ఆమెకు గుణపాఠం నేర్పిందని సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
వీడియోతో పాటు "ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు ఇలా జరిగింది. ఈ వీడియో దుబాయ్‌లో జరిగిన మహిళల రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్‌ను గెలుచుకున్న పాకిస్తాన్ మహిళా రెజ్లర్. ఆమె రెజ్లింగ్ టోర్నమెంట్ చూస్తున్న భారతీయ మహిళలను ఎగతాళి చేసింది. ఏ భారతీయ మహిళనైనా తనతో పోటీ పడమని సవాలు చేసింది. భారతీయ అమ్మాయి కవితా విజయలక్ష్మి ఆ సవాలును స్వీకరించి, భారతదేశ బలాన్ని ఆమెకు చూపించింది." అంటూ షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కనిపిస్తున్న మహిళలు ఇద్దరూ భారతీయులే. ఈ వీడియో 2016 నాటి రెజ్లింగ్ ఈవెంట్‌ను చూపిస్తుంది.
వీడియోను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, www.g8cwe.com వెబ్సైట్ చిరునామాతో వీడియోలో బ్యానర్లను కనుగొన్నాము. కానీ, ఆ వెబ్సైట్ కోసం శోధించినప్పుడు, URLతో కూడిన అటువంటి వెబ్సైట్ ఏదీ మాకు కనిపించలేదు. CWE అనేది కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (CWE), భారతదేశపు మొట్టమొదటి ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రమోషన్, ఇండియన్ అమెరికన్ రెజ్లర్ దలీప్ సింగ్.. ది గ్రేట్ ఖలీగా ప్రసిద్ధి చెందిన ఆయన శిక్షణ అకాడమీని స్థాపించారు. అందుకు సంబంధించిన వివరాలు www.khaliCWE.com అనే వెబ్సైట్ మాకు కనిపించింది.
CWE ఇండియా యూట్యూబ్ ఛానెల్ ను వెతికినప్పుడు, రెజ్లింగ్‌కు సంబంధించిన అనేక వీడియోలు మాకు కనిపించాయి. మహిళా రెజ్లింగ్ గురించి వీడియోల కోసం మేము వెతికినప్పుడు, CWE ఇండియా అనే యూట్యూబ్ ఛానెల్ ‘Kaivta accepted the open challenge of BB Bull Bull' అనే శీర్షికతో ప్రచురించిన అసలు వీడియో మాకు కనిపించింది.
జూన్ 18, 2016న “BB BULL BULL IS OUT OF CONTROL! Tensions rise between BB Bull Bull and Hard KD.” అనే శీర్షికతో ప్రచురించిన అదే మహిళా రెజ్లర్లను చూపించే మరొక వీడియోను కూడా మేము కనుగొన్నాము
రెజ్లర్‌ను ఓడించిన కవిత గురించి మేము మరింత వెతికినప్పుడు, ఆమె మాజీ హర్యానా పోలీసు అధికారిణి, MMA ఛాంపియన్ అని మేము కనుగొన్నాము. తరువాత ఆమె WWE కోసం సైన్ అప్ చేసి హార్డ్ KD అనే మారుపేరును పొందింది. సెప్టెంబర్ 30, 2017న ప్రచురించిన dnaindia నివేదిక ప్రకారం, భారతదేశం నుండి మొదటి ప్రొఫెషనల్ మహిళా రెజ్లర్ అయిన BB బుల్ బుల్, జలంధర్ (పంజాబ్)లోని కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (CWE) హబ్‌లో జరిగిన పోరాటంలో హర్యానా మాజీ పోలీసు అధికారి, పవర్-లిఫ్టింగ్, MMA ఛాంపియన్ కవిత చేతిలో ఓడిపోయారు. తనతో పోరాడటానికి అరీనా వద్ద గుమిగూడిన ప్రేక్షకులను బుల్ బుల్ సవాలు చేస్తూ కనిపించింది, అప్పుడే కవిత సవాలును స్వీకరించి బరిలోకి దిగింది.
కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (CWE) అనేది జలంధర్‌లో ఉన్న ఒక భారతీయ స్వతంత్ర ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రమోషన్, రెజ్లింగ్ కు సంబంధించిన శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది. దీనిని నవంబర్ 24, 2015న మాజీ WWE సూపర్‌స్టార్ ది గ్రేట్ ఖలీ ప్రారంభించారు.
2016లో ది న్యూస్ మినిట్ ప్రచురించిన మరో కథనం ప్రకారం, CWE హర్యానా మాజీ పోలీసు అధికారిణి, పవర్-లిఫ్టింగ్, MMA ఛాంపియన్ కవిత BB బుల్ బుల్ ఓపెన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని జలంధర్‌లోని శిక్షణా పాఠశాల, రెజ్లింగ్ ప్రమోటర్ అయిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ నిర్వహించింది, దీనిని మాజీ WWE రెజ్లర్ ది గ్రేట్ ఖలీ ప్రారంభించారు.
2023 లో కూడా ఇదే వీడియోతో పాటు ఇలాంటి క్లెయిమ్ వైరల్ అయినప్పుడు తెలుగుపోస్ట్ ఆ క్లెయిమ్ నిరాధారమని తేల్చింది.
కాబట్టి, వైరల్ వీడియో పాతది, వీడియోలో కనిపిస్తున్న రెజ్లర్ పాకిస్తానీ మహిళ కాదని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇది దుబాయ్‌లో జరిగిన రెజ్లింగ్ మ్యాచ్ కాదు, ఈ కార్యక్రమం జలంధర్‌లో జరిగింది. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు మహిళలు భారతీయులే. ఈ వీడియో పాతది, ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించినది కాదు.
Claim : ఆపరేషన్ సింధూర్ తర్వాత దుబాయ్‌లో జరిగిన పోటీలో భారత రెజ్లర్ కవితా విజయలక్ష్మి పాకిస్తాన్ రెజ్లర్‌ను ఓడించింది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story