ఫ్యాక్ట్ చెక్: పైలట్ తన తల్లిని విమాన ప్రయాణానికి అహ్వానిస్తున్న వీడియో అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించింది కాదు
జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం లండన్‌కు బయలుదేరిన 32 సెకన్ల తర్వాత, అంటే

Claim :
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యే ముందు పైలట్ తన తల్లిని విమానంలోకి ఆహ్వానించిన దృశ్యం చూడొచ్చుFact :
వైరల్ వీడియో మార్చి 2025 నాటిది. ఇది జూన్ 12, 2025న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించినది కాదు.
జూన్ 12న భారతదేశం అత్యంత దారుణమైన విమాన విపత్తులలో ఒకదాన్ని చవిచూసింది, ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 రెండు ఇంజన్లు విఫలమై ఉండవచ్చని, పూర్తిగా విద్యుత్ లేదా హైడ్రాలిక్ పనిచేయకపోయి ఉండవచ్చని నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు జూన్ 12 మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి బయలుదేరి 2 కి.మీ కంటే తక్కువ దూరంలో ఉన్న బిజె మెడికల్ కాలేజీ కాంప్లెక్స్‌లో కూలిపోయింది. విమానం టేకాఫ్ అయిన 32 సెకన్ల తర్వాత మధ్యాహ్నం 1.38 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధం లేని అనేక పాత వీడియోలు, చిత్రాలు తప్పుడు వాదనలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతూ ఉన్నాయి. అలాంటి ఒక వీడియో హృదయ విదారక సంఘటనను చూపిస్తుంది. అందులో ఒక యువకుడు తాను పైలట్‌గా ఉన్న విమానంలోకి తన తల్లిని స్వాగతించి, తన తల్లిని అంతర్జాతీయ విమానంలో తీసుకెళ్లడానికి సంతోషంగా ఉన్నానని ప్రకటించాడు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు జరిగిన సంతోషకరమైన క్షణాలను ఇది చూపిస్తుందనే వాదనతో ఈ వీడియో ప్రచారంలో ఉంది.
“His dream was to fly his mum…. Tràgîcàlly, he flew her and his son to their final rest. 💔 RIP” అంటూ పోస్టులు పెడుతున్నారు
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న ఈ వాదన నిజం కాదు. యువ పైలట్ తన తల్లిని స్వాగతిస్తున్నట్లు చూపించే వీడియో జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినది కాదు.
ప్రమాదం జరిగిన AI 171 విమానం పైలట్లు కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ అని గుర్తించబడింది. వైరల్ అవుతున్న వీడియోలోని పైలట్ వారు కాదు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆ వీడియో మార్చి 2025 నాటిదని మేము కనుగొన్నాము. వీడియోలో కనిపిస్తున్న పైలట్ పుష్పన్ అని పేర్కొన్న అనేక వార్తా నివేదికలు లభించాయి.
ఏప్రిల్ 19, 2025న హిందూస్తాన్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పైలట్ తన తల్లి పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత ఇంటర్నెట్ ద్వారా వ్యాపించి ఎంతో మంది హృదయాలను దోచుకుంది. అశ్వత్ పుష్పన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ విజువల్స్ వైరల్‌గా మారాయి. ఇప్పటివరకు ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించింది. విమానాన్ని నడుపుతున్న అశ్వత్, టేకాఫ్‌కు ముందు ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ప్రయాణీకులతో తన భావోద్వేగ క్షణాన్ని పంచుకున్నారు.
న్యూస్ 18 కూడా ఈ నివేదికను ప్రచురించింది, విమానంలో తన తల్లిని పైలట్ ఆశ్చర్యపరిచే వీడియో లక్షలాది మంది చూసారని పేర్కొంది. ఈ వీడియోను పైలట్ అయిన అశ్వత్ పుష్పన్ పోస్ట్ చేశారు. అతని తల్లి విమానం ఎక్కినప్పుడు, విమానం బోర్డింగ్ పూర్తయిన తర్వాత అతను ఒక ప్రత్యేక ప్రకటన చేశారు.
“Cleared for takeoff - with the most special passenger on board!” Welcome on board, Mom…” అనే క్యాప్షన్ తో అసలు వీడియోను అశ్వత్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. తన తల్లి తో ప్లేన్ లో, ఇంకా కాక్ పిట్ లో దిగిన చిత్రాలను పొందుపరిచి ఒక వీడియో ఇది.
ఒక యువ పైలట్ తన తల్లిని విమానంలో స్వాగతిస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించినది కాదు. అహ్మదాబాద్‌లో కూలిపోయిన AI 171 విమానం టేకాఫ్‌కు ముందు హృదయ విదారక క్షణాలను ఈ వీడియో చూపిస్తుందనే వాదన అబద్దం.

