Fri Dec 05 2025 15:52:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: స్థానిక నేతలు తీవ్రవాదులకు మద్దతిస్తున్నారనేది నిజం కాదు, ఈ వీడియో పహల్గామ్ ఘటనకి సంబంధించినది కాదు
2025 ఏప్రిల్ 22న కశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన ఘోరమైన దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత

Claim :
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన స్థానిక నాయకుడి అరెస్టును వైరల్ వీడియో చూపిస్తోందిFact :
కాత్రా-వైష్ణో దేవి రోప్వేకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న స్థానిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో ఇది. దీనికి, పహల్గామ్ దాడికి సంబంధం లేదు.
2025 ఏప్రిల్ 22న కశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన ఘోరమైన దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ ఉగ్రవాద దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సమర్పించిన ప్రాథమిక నివేదిక ప్రకారం, లష్కరే తోయిబా (LeT), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), పాకిస్తాన్ సైన్యం ఈ దాడిలో పాల్గొన్నట్లు తేల్చింది. కాశ్మీర్ లోయలోని దాదాపు 20 మంది దుకాణదారులు ఉగ్రవాదులకు లాజిస్టిక్ మద్దతు అందించిన్నట్లు గుర్తించారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులు భారత ప్రభుత్వ నిర్ణయానికి తమ మద్దతు ప్రకటించారు.
పహల్గామ్లో ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినందుకు స్థానిక నాయకుడిని అరెస్టు చేసినట్లుగా పేర్కొంటూ, ఒక నాయకుడిని వీధి మధ్యలో సాయుధ దళాలు అరెస్టు చేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతోంది. “ये कश्मीर के स्थानीय नेता हैं, जिन्हें आतंकवादियों का साथ देने के लिए पकड़ कर ले जाया जा रहा है..!!” అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో నవంబర్ 2024 నాటిది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ సెర్చ్ చేశాం. నవంబర్ 2024లో అదే వీడియోను షేర్ చేసిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ మాకు లభించాయి. జమ్మూ లింక్స్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ నవంబర్ 27, 2024న “Katra ropeway clashes: Police arrest two labour leaders in raids” అనే శీర్షికతో వీడియోను షేర్ చేసింది. వీడియో వివరణలో “కత్రా పట్టణం నుండి వైష్ణో దేవి హిందూ మందిరం వరకు ప్రతిపాదిత రోప్‌వే లైన్‌ను జమ్మూలోని కత్రాలో వ్యాపారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల తరువాత ఇద్దరు కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేశారు” అని ఉంది.
రియాసి అప్డేట్స్ అనే ఫేస్బుక్ పేజీలో ‘కాంగ్రెస్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్, అతని సహచరుడు సోహన్ చంద్ అరెస్టు’ అనే శీర్షికతో వీడియో షేర్ చేశారు.
గ్రేటర్ కాశ్మీర్లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, జమ్మూలోని కాట్రాలో ఇద్దరు కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేశారు, కాట్రా పట్టణం నుండి వైష్ణో దేవి హిందూ మందిరం వరకు ప్రతిపాదిత రోప్‌వే లైన్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రోప్‌వే లైన్ మార్కెట్లో జనసమూహాన్ని తగ్గిస్తుందని, తత్ఫలితంగా వారి వ్యాపారాలను దెబ్బతీస్తుందని దుకాణదారులు నిరసన తెలిపారు. అయితే ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి, పోలీసులపై రాళ్లు రువ్వారు. దుకాణదారులు ఇద్దరు పోలీసులను కూడా కొట్టడం కనిపించింది. ఘర్షణల తరువాత, పట్టణం అంతటా జరిగిన దాడుల్లో ఇద్దరు కార్మిక నాయకులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన నాయకులను భూపిందర్ సింగ్, సోహన్ చంద్గా గుర్తించారు.
"కొత్త రోప్‌వే ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈ నాయకులు నాలుగు రోజుల పాటు కాట్రాలో నిరసనకు నాయకత్వం వహించారు, రాళ్ల దాడి ఘటనకు కూడా కారణమయ్యారు" అని అధికారిక వర్గాలు తెలిపినట్లు గ్రేటర్ కాశ్మీర్ నివేదించింది. రాళ్ల దాడి, పోలీసులపై దాడి చేసినందుకు పోలీసులు చాలా మంది నిరసనకారులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
అందువల్ల, వైరల్ వీడియోలో పహల్గామ్ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినందుకు అరెస్టు చేసిన స్థానిక కాశ్మీరీ నాయకుడిని చూపించలేదు. కాట్రా నుండి వైష్ణోదేవి మందిరానికి రోప్‌వే లైన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కార్మిక నాయకుల అరెస్టుకు సంబంధించింది. ఈ నిరసనలు నవంబర్ 2024లో జరిగాయి. కాబట్టి, వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన స్థానిక నాయకుడి అరెస్టును వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By : X (Twitter) users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story

