Fri Dec 05 2025 12:48:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బాలుడు తన సోదరుడి మృతదేహాన్ని పట్టుకుని ఉన్న వైరల్ వీడియో 2022 నాటిది, ఇటీవలిది కాదు
భారతదేశంలో ప్రాథమిక రవాణా నుండి అధునాతన లైఫ్ సపోర్ట్ వరకు వివిధ వైద్య అవసరాలు, అత్యవసర పరిస్థితులకు సంబంధించి వివిధ రకాల

Claim :
8 ఏళ్ల బాలుడు తన రెండేళ్ల సోదరుడి మృతదేహాన్ని పట్టుకుని తన తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు. వైరల్ వీడియో ఇటీవల చోటు చేసుకున్న ఘటనFact :
వైరల్ వీడియో పాతది. ఈ సంఘటన 2022లో మధ్యప్రదేశ్‌లో జరిగింది.
భారతదేశంలో ప్రాథమిక రవాణా నుండి అధునాతన లైఫ్ సపోర్ట్ వరకు వివిధ వైద్య అవసరాలు, అత్యవసర పరిస్థితులకు సంబంధించి వివిధ రకాల అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసు కూడా అందుబాటులో ఉంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కింద ప్రభుత్వ చొరవతో, క్లిష్టమైన కేసులను "గోల్డెన్ అవర్" సమయంలో తీసుకుని వెళితే ప్రాణాలను కాపాడవచ్చు. 108 అంబులెన్స్ సేవలు దేశవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నాయి. మరణించిన వ్యక్తుల రవాణా కోసం, ఒక ప్రత్యేక రవాణా వ్యవస్థ కూడా ఉన్నాయి. ఇందులో మార్చురీ అంబులెన్స్‌లు, ఇతర ప్రత్యేక వాహనాలు కూడా ఉన్నాయి.
భారతదేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పరిమిత వనరుల కారణంగా మృతదేహాలను రవాణా చేయడం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. వివిధ రాష్ట్రాలలో జరిగిన అనేక సంఘటనలు కొన్ని కుటుంబాల దుస్థితిని హైలైట్ చేస్తాయి. సరైన రవాణా సౌకర్యం పొందలేక, తరచుగా మోటార్ సైకిళ్ళ మీద మృతదేహాలను తీసుకుని వెళ్లడం, మోసుకుంటూ వెళ్లడం లాంటి ఘటనలు కూడా చూస్తున్నాం.
ఇదిలా ఉండగా, ఒక చిన్న పిల్లవాడు కాలువ దగ్గర కూర్చుని తన తమ్ముడి మృతదేహాన్ని పట్టుకుని ఆసుపత్రి ఆవరణలో వేచి ఉన్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మోరెనా అంబాలోని బద్ఫాడా గ్రామంలో జరిగిందనే వాదనతో షేర్ చేస్తున్నారు. ఆ వీడియో వైరల్ అయి వైద్య రంగంలో కలకలం రేపిందని, వెంటనే అంబులెన్స్ సర్వీస్ ను అందించారంటూ కూడా ఆ పోస్టులు చెబుతున్నాయి.
“यह तस्वीर मोदी और बीजेपी की स्वास्थ्य व्यवस्था की सबसे दर्दनाक तस्वीर है मुरैना में एक गरीब पिता अपने मासूम बेटे की लाश अस्पताल से सड़क तक खुद ढोता है, क्योंकि अस्पताल ने एम्बुलेंस तक नहीं दी। दो साल के शव को आठ साल का भाई गोद में लिए बैठा रहा, जबकि पिता भाड़े के पैसे के लिए भटकता रहा। ये है मोदी के नए भारत की असली हकीकत जहां पूंजीपति दोस्तों के लिए तो जगह है लेकिन ग़रीब के लिए नहीं I” అంటూ ఈ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ కూడా హిందీలో షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు తొలగించినా, దాని ఆర్కైవ్ లింకును ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో ఇటీవలిది కాదు. ఇది 2022 సంవత్సరంలో జరిగిన సంఘటన.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, జూలై 2022లో ప్రచురించిన అనేక వార్తా నివేదికలకు సంబంధించిన వీడియో స్క్రీన్‌షాట్‌ను చూడొచ్చు. తెలంగాణ టుడేలో జూలై 2022లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఎనిమిదేళ్ల బాలుడు తన 2 ఏళ్ల సోదరుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన గంటల తరబడి కూర్చోవలసి వచ్చిన హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో వారి తండ్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడానికి వాహనం కోసం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
డెక్కన్ హెరాల్డ్‌లో ప్రచురితమైన ఒక వార్తా నివేదిక ప్రకారం, కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను వైరల్ చేశారు. అధికారుల తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. ఆ క్లిప్‌లో, బాలుడు జిల్లా ఆసుపత్రి సరిహద్దు గోడ వెంట కూర్చుని, చికిత్స సమయంలో మరణించిన తన రెండేళ్ల సోదరుడి మృతదేహాన్ని పట్టుకుని కనిపించాడు.
BBC ప్రకారం, ఓ తండ్రి తన చిన్న కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వాహనం కోసం వెతుకుతున్నాడు. మొరెనా జిల్లాలోని అంబాహ్‌లోని బద్ఫారా గ్రామానికి చెందిన పూజారామ్ జాతవ్ తన రెండేళ్ల కుమారుడు రాజాను జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. రక్తహీనత, ఇతర సమస్యలతో బాధపడుతున్న రాజా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పెద్ద కొడుకు ఒడిలో రాజా మృతదేహాన్ని ఉంచేసి తండ్రి వాహనం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.
8 ఏళ్ల బాలుడు తన రెండేళ్ల సోదరుడి మృతదేహాన్ని పట్టుకుని తన తండ్రి కోసం ఎదురు చూస్తున్న వైరల్ వీడియో ఇటీవలి వీడియో కాదు. ఇది 2022 సంవత్సరం నాటిది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : 8 ఏళ్ల బాలుడు తన రెండేళ్ల సోదరుడి మృతదేహాన్ని పట్టుకుని తన తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు. వైరల్ వీడియో ఇటీవల చోటు చేసుకున్న ఘటన
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : Misleading
Next Story

