ఫ్యాక్ట్ చెక్: ఢిల్లీ మెట్రో బ్రిడ్జ్ కూలినట్టు ప్రచారం అవుతున్న వీడియో ఏఐ తో తయారుచేసింది
భారత దేశంలో కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, హైదరాబాద్, జైపూర్, లక్నో, నాగ్‌పూర్ వంటి పలు నగరాల్లో మెట్రో సేవ

Claim :
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లోని వంతెన విరిగిపడిపోవడంతో వేల మంది చిక్కుకుని మరణించారని వైరల్ వీడియో చూపిస్తోందిFact :
ఈ వీడియో ఎలాంటి నిజమైన సంఘటనను చూపిస్తూ లేదు; ఇది ఏఐ టెక్నాలజీతో రూపొందించిన వీడియో
భారత దేశంలో కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, హైదరాబాద్, జైపూర్, లక్నో, నాగ్‌పూర్ వంటి పలు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ మెట్రో సేవలు వాహనాల్లో ట్రాఫిక్ తగ్గించడంలో, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో కోల్‌కతా మెట్రో అత్యంత పాతదైతే, ఢిల్లీ మెట్రో దేశంలోనే రెండవ పెద్ద మెట్రో నెట్వర్క్. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ (DMRC) నిర్వహణలో ఢిల్లీతో పాటు మరికొన్ని శాటిలైట్ నగరాలకు మెట్రో సేవలు సాగుతున్నాయి. మొత్తం 389 కిమీ మేర నెట్వర్క్, 285 స్టేషన్లు ఉన్నాయి. ఇందులో పొడవాటి పింక్ లైన్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. స్త్రీలకు ప్రత్యేక క్యాబిన్ కూడా ఉంది.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా, ప్రయాణికులు మెట్రో స్టేషన్లో ఉండగా స్థలం కూలిపోవడం, పలువురు చిక్కుకోవడం, మరణించడం వంటి దృశ్యాలున్న వీడియోను ‘‘దిల్లీలో మెట్రో వంతెన కూలి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు’’ అనే శీర్షికతో 31/7/2025 తేదీన జరిగినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్‌ను ఇక్కడ చూడవచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా, కొన్ని స్థానాల్లో దృశ్య వక్రీకరణలు (distortions), ప్రత్యేకంగా మెట్లు దిగి వచ్చే మహిళ శరీరం అసహజంగా మారటం, డిఫార్మ్ అవటం గమనించాం.
Cantilux టూల్‌ను ఉపయోగించి పరిశోధించగా ఈ వీడియో ఏఐను వాడి రూపొందించారని నిర్ధారించాము. వీడియోలోని pattern, texture, artifact లక్షణాలను విశ్లేషించి ఇది ఏఐతో తయారైనదని వెల్లడించారు. స్క్రీన్‌షాట్‌ను ఇక్కడ చూడవచ్చు.
ఈ తరహా తప్పుడు వీడియోలు ప్రజల్లో భయానక వాతావరణాన్ని కలిగించవచ్చు. ఏఐను ఉపయోగించి వీడియోలు, చిత్రాలు తయారు చేయడం ఎంతో సులభం అయిపోయింది. అయితే, వీటిని వాడి తప్పుడు క్యాప్షన్లతో షేర్ చేస్తున్నారు. ఈ రకమైన సమాచారం చూసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. నిజమైన సమాచారం తెలుసుకునే నైపుణ్యం పెంచుకోవడం ఇప్పుడు అత్యంత అవసరం.
ఏఐతో తయారుచేసిన ఇలాంటి మరిన్ని వీడియోలను ఇక్కడ చూడవచ్చు.
కాబట్టి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఢిల్లీ మెట్రో బ్రిడ్జ్ కూలినట్లు చూపించే ఈ వీడియో వాస్తవ సంఘటన కాదు, ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నకిలీ వీడియో మాత్రమే. అలాంటి ఘటన అసలు జరగలేదు. ఢిల్లీ మెట్రోలో బ్రిడ్జి కూలిందనే వాదన నిజం కాదు.

