ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో కనపడుతున్నది పాట్నా మెట్రో కాదు
Viral Patna Metro video is fake. The video is from Gurugram, not Patna. Get the latest truth behind the viral clip

Claim :
వైరల్ వీడియోలో కొంతమంది ప్రయాణికులు టికెట్ లేకుండా పాట్నా మెట్రోలో ప్రవేశిస్తున్నారని చూపుతోందిFact :
వీడియో పాట్నా మెట్రోకు సంబంధం లేదు; ఇది గురుగ్రామ్ కి చెందినది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా సీఎం నితీష్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ‑బీజేపీ కూటమి అభివృద్ధి, మౌలిక వసతులు, చట్ట-వ్యవస్థ అంశాలను తమ ప్రధాన విజయాలుగా పేర్కొంటోంది. మరోవైపు ప్రతిపక్షం, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు — నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ ఎన్నికల హడావుడిలో, సోషల్ మీడియా కూడా కీలక వేదికగా మారింది. వివిధ పార్టీ అనుచరులు తమ రాజకీయ వాదనలకు బలాన్ని ఇవ్వడానికి పలు వీడియోలు, చిత్రాలు, పోస్టులు షేర్ చేస్తున్నారు. వీటిలో, బీహార్‌లో తాజాగా ప్రారంభమైన పాట్నా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఒక వీడియో విస్తృతంగా వైరల్ అయింది. వీడియోలో కొంతమంది వ్యక్తులు టికెట్ లేకుండా టర్న్స్టైల్ కిందుగా వెళ్లి మెట్రో స్టేషన్లోకి ప్రవేశిస్తున్నట్లు చూపబడుతుంది. ఈ వీడియోని పాట్నా మెట్రోలో నిర్వాహక లోపాలు ఉన్నట్లు చూపే వాదనతో షేర్ చేస్తున్నారు.
క్లెయిం కి చెందిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వాదన నిజం కాదు. వైరల్ వీడియో పాట్నా మెట్రోకు సంబంధించినది కాదు.
వీడియోలోని దృశ్యాలను పరిశీలించగా, కార్డ్‑స్వైప్ మిషీన్లో కనిపించే లోగో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)కి చెందింది, ఇది పాట్నా మెట్రో రైల్ కార్పొరేషన్ (PMRCL) లోగో కాకుండా ఉంది. అలాగే, “Swasth Vibhag Gurugram”, “Oyster’s Water Park” బోర్డులు కనిపించడం ద్వారా, ఈ ఫుటేజ్ గురుగ్రామ్ ప్రాంతానికి చెందినదని స్పష్టం అవుతుంది. ఆ స్క్రీన్ షాట్ లను ఇక్కడ చూడొచ్చు.
ఫేస్బుక్లో ఒక వినియోగదారుడు, ఈ వీడియో ను పాట్నా పై తప్పుడు ప్రచారం చేసేందుకు వాడుతున్నారని వీడియో షేర్ చేసారు.
ఒక X వినియోగదారుడు, తన ట్వీట్లో ఇది తప్పుడు ప్రచారం తో షేర్ చేస్తున్నారంటూ, వీడియో లో నుంచి తీసిన స్క్రీన్ షాట్ లను షేర్ చేసారు.
పాట్నా మెట్రో రైల్ కార్పొరేషన్ అక్టోబర్ 13, 2025న తమ అధికారిక X ఖాతా ద్వారా వైరల్ వీడియో వారి ఏ స్టేషన్‌కు సంబంధించినవి కావని స్పష్టం చేసింది. తన X పోస్ట్ లో "ఇది బీహార్ గర్వం, గాసిప్ కాదు! పట్నా మెట్రో ప్రజలకు అందిస్తున్న భద్రత, శుభ్రమైన నిర్వహణ, సౌకర్యాన్ని చూడండి, కౌంటర్ల వద్ద టికెట్లు, AFC గేట్ల ద్వారా సాఫీగా ప్రవేశం, కుటుంబాలు సౌకర్యంగా ప్రయాణం. తప్పుడు వైరల్ వీడియోలను నమ్మకండి — నిజంగా మీరు ఇక్కడ చూస్తున్నదాన్నే నమ్మండి! సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియోలో ప్రయాణికులు AFC గేట్ల కిందగా లేదా వాటి మధ్యగా వెళ్లి టికెట్ లేకుండా పట్నా మెట్రోలో ప్రయాణిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వాదన నిజం కాదు. ఆ వీడియో పట్నా మెట్రో స్టేషన్‌కి సంబంధించినది కాదు. పట్నా మెట్రోలో ఇలాంటి సంఘటన ఏదీ జరగలేదు. పట్నా మెట్రో కఠినమైన భద్రతా, టికెటింగ్ నిబంధనలను పాటిస్తూ పనిచేస్తోంది. నిర్ధారించని వీడియోలను పంచడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, బీహార్ అభివృద్ధి కోసం నిర్మించబడిన ఈ ప్రాజెక్టు ప్రతిష్ఠకు హాని కలిగిస్తుంది. మేము ప్రజలు మరియు మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి నిర్ధారణ లేని వీడియోలను ఫార్వర్డ్ చేయవద్దు, ప్రచారం చేయవద్దు. బీహార్ ప్రతిష్ఠను కాపాడుకుందాం. ప్రతి ఒక్కరికి సరైన సమాచారం చేరేలా, బీహార్ గర్వంగా నిలిచే పట్నా మెట్రోను తప్పుడు వార్తల నుండి రక్షిద్దాం. #PatnaMetro #FakeNewsAlert #PublicAdvisory #BiharOnTrack #PatnaMetroFactCheck" అంటూ పోస్ట్ చేసింది.
కనుక, బీహార్ ఎన్నికల సమయంలో వైరల్ వీడియోను పాట్నా మెట్రోకు సంబంధించిందని చూపడం తప్పుదారి. వీడియో నిజానికి గురుగ్రామ్ ప్రాంతానికి చెందినది, పాట్నా మెట్రోలో టికెట్ లేకుండా ప్రవేశిస్తున్నారనే వాదన నిజం కాదు.

