Fri Dec 05 2025 09:51:15 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బరేలీ మార్కెట్లో ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతను వైరల్ వీడియో చూపడం లేదు
బరేలీలో చట్ట విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను, దేశ అశాంతిలో భాగమైన వ్యక్తుల ఆస్తులను కూల్చివేశారు. బరేలీ డెవలప్మెంట్

Claim :
బరేలీ మార్కెట్లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతను వైరల్ వీడియోలో చూడొచ్చుFact :
ఆ వీడియో పాతది, పాకిస్తాన్ లో చోటు చేసుకున్నది. ఇది బరేలీ మార్కెట్ లో చోటు చేసుకున్న ఘటన కాదు.
బరేలీలో చట్ట విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను, దేశ అశాంతిలో భాగమైన వ్యక్తుల ఆస్తులను కూల్చివేశారు. బరేలీ డెవలప్మెంట్ అథారిటీ (BDA), స్థానిక అధికారులు ఈ చర్యలకు నాయకత్వం వహించారు. ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మతాధికారి తౌకీర్ రజా ఖాన్ తో సంబంధం ఉన్న వ్యక్తుల ఎనిమిది అక్రమ ఆస్తులను గుర్తించి అధికారులు చర్యలు తీసుకున్నారు. "ఐ లవ్ మహ్మద్" పోస్టర్ వివాదంపై నిరసనలలో పాల్గొనేలా ప్రజలను రెచ్చగొట్టారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిరసనకారులు వాట్సాప్‌లో సందేశాల ద్వారా రెచ్చగొట్టారు.
బరేలీ డెవలప్మెంట్ అథారిటీ (BDA), జిల్లా పరిపాలన బృందాలు జగత్‌పూర్‌లోని ఫైక్ ఎన్క్లేవ్, ఓల్డ్ సిటీ ప్రాంతాలలో సంయుక్తంగా ఈ డ్రైవ్ ను నిర్వహించాయి. ఈ నిర్మాణాలు ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించబడ్డాయని, కొన్ని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలని అధికారులు ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో అక్రమంగా నిర్మించిన ఆస్తుల కూల్చివేత అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "బరేలీ మార్కెట్లో స్వచ్ఛ భారత్ అభియాన్ సమయంలో అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు నిర్మించిన అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు" అనే శీర్షికతో ఈ వీడియో ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన కూల్చివేతకు సంబంధించినది కాదు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించినప్పుడు, పాకిస్తాన్ కు సంబంధించిన పాత వీడియో అని, ఉత్తరప్రదేశ్ లేదా భారతదేశానికి సంబంధించినది కాదని మాకు తెలిసింది. #viralshort #punjabpolice #govtofpakistan #sad #ptiofficial #trending #city #contstruction అనే హ్యాష్ ట్యాగ్స్ తో యూట్యూబ్ వీడియోలు మాకు లభించాయి.
“Government Operation” అంటూ #punjabpolice అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పోస్టులు పెట్టారు.
మరింత వెతికినప్పుడు “Heavy Encroachment Operation Held in Depalpur - 50 Year Old Illegal Shops Demolished #Encroachment #IllegalConstruction #AntiEncroachment #Depalpur” అనే టైటిల్ తో ఫేస్బుక్ యూజర్ 'ఉర్దూ పాయింట్ వీడియోస్' షేర్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియో మాకు లభించాయి.
ఈ వీడియోలను మేము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, "ముజ్జామిల్ సెంటర్" అని ఉర్దూలో రాసిన భవనం కనిపించింది. ఈ పోస్ట్లన్నీ కూల్చివేసిన దుకాణాలు దేపాల్పూర్లోని గల్లా బజార్ ప్రాంతంలో ఉన్నాయని తెలిపాయి.
ఆగస్టు 22, 2025న హుస్సేన్ లక్కీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియో, అక్రమ నిర్మాణాల తొలగింపుకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని చూపిస్తుంది. “Massive anti-encroachment drive in Depalpur | Live Video: Shops demolished on Galla Mandi Road.” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియోలో మార్కెట్లో అధికారులు నిర్వహించిన కూల్చివేత డ్రైవ్ గురించి రిపోర్టర్ నివేదించారు. దేపాల్పూర్లోని గల్లా మండి ప్రధాన మార్కెట్లో అక్రమంగా నిర్మించిన దుకాణాలను నగర అసిస్టెంట్ కమిషనర్‌తో సహా పలువురు అధికారుల సమక్షంలో కూల్చివేస్తున్నట్లు వివరించారు.
కాబట్టి, వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి సంబంధించినది కాదు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని దేపాల్పూర్లో దుకాణాల కూల్చివేతను చూపిస్తుంది. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : బరేలీ మార్కెట్లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతను వైరల్ వీడియోలో చూడొచ్చు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

