ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న సమంత, రకుల్ ప్రీత్, తమన్నాల ఓటర్ ఐడీలు మార్ఫింగ్ చేసినవి
సినీ నటులు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ జూబ్లీహిల్స్ ఓటర్లుగా. గతంలో తమన్నా, రకుల్ ప్రీత్, సమంత ఓటు హక్కును హైదరాబాద్ లో వినియోగించుకున్నారా అని తెలుసుకోడానికి

Claim :
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సినీ నటులు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ల ఓటర్ ఐడీలు ఇవే అంటూ ప్రచారంFact :
వైరల్ అవుతున్న పోస్టులు మార్ఫింగ్ చేసినవి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMలు), ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ (VVPATలు) మొదటి ర్యాండమైజేషన్ విజయవంతంగా పూర్తయింది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో EVM నిర్వహణ వ్యవస్థ (EMS) ద్వారా ర్యాండమైజేషన్ జరిగింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాలకు మొత్తం 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 VVPAT లను కేటాయించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. నియోజకవర్గాల వారీగా EVMలు, VVPAT ల వివరాలను అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పంచుకున్నారు. ఈ యంత్రాలను ఇప్పుడు సంబంధిత అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్‌లలో, అధికారుల పర్యవేక్షణలో, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిల్వ చేస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌పై భారత ఎన్నికల సంఘం నిషేధం విధించింది. అక్టోబర్ 13న ECI నోటిఫికేషన్ ప్రకారం, నవంబర్ 6న ఉదయం 7 గంటల నుండి నవంబర్ 11న సాయంత్రం 6.30 గంటల వరకు ఏ విధమైన ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం లేదా ప్రచారం చేయడం నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిమితి టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా ప్రింట్, ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాకు వర్తిస్తుంది.
అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నకిలీ ఓటర్లను కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించిందంటూ ఓ వైపు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉండగా, టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న ఫోటోలు నిజమైనవి కావు. ఎడిటింగ్ చేసి పోస్టు చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఏడాది జూన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన అభ్యర్థిగా వి.నవీన్ యాదవ్‌ను ప్రకటించగా, ప్రతిపక్ష బిఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే భార్య మాగంటి సునీతను నిలబెట్టింది. బీజేపీకి చెందిన లంకాల దీపక్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు.
ప్రముఖ సినిమా హీరోయిన్స్ తో కూడిన ఫోటో వైరల్ అవ్వడంపై తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ విభాగం గతంలో తమన్నా, రకుల్ ప్రీత్, సమంత ఓటు హక్కును హైదరాబాద్ లో వినియోగించుకున్నారా అని తెలుసుకోడానికి ప్రయత్నించింది. మాకు సంబంధిత మీడియా నివేదికలు ఏవీ కనిపించలేదు.
రకుల్ ప్రీత్ సింగ్ తన ఓటు హక్కును 2024 ముంబై ఎన్నికల్లో వినియోగించుకున్నట్లుగా పలు నివేదికలు కనిపించాయి. బాంద్రా వెస్ట్ లో తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకుంది.
తమన్నా భాటియా కూడా ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పలు వీడియోలు మాకు లభించాయి.
ఇక సమంత 6 సంవత్సరాల క్రితం తన మాజీ భర్త నాగ చైతన్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న విజువల్స్ మాకు లభించాయి.
ఇక వైరల్ అవుతున్న సినీ నటుల ఫోటోలకు సంబంధించి ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పలు తెలుగు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
హైదరాబాద్..
— TV9 Telugu (@TV9Telugu) October 16, 2025
జూబ్లీహిల్స్ లో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఫేక్ ఓటర్ కార్డులతో సోషల్ మీడియాలో చక్కర్లు..
టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా ల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీ లు క్రియేట్ చేసి ప్రచారం..
వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు… pic.twitter.com/Ww6yrUWuhw
ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
ఈ ఓటరు కార్డులు వైరల్ కావడంతో అది అధికారుల దృష్టికి వెళ్ళింది. వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆయా కార్డులు నకిలీవంటూ తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్డులు ముద్రించి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముగ్గురు హీరోయిన్లకు 8-2-120/4 అనే ఒకే ఇంటి నెంబర్‌ను ఈ పోస్టులో కేటాయించారు. ఎపిక్ నెంబర్లను మాత్రం రకుల్‌కు డబ్ల్యుకేహెచ్ 4450729గా, సమంతకు డబ్ల్యుకేహెచ్ 4450946గా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కు కేటాయించిన ఎపిక్ నెంబర్‌నే ఈ పోస్టుల్లో క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఎలక్షన్ వింగ్ అధికారులు జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతో జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఈ మూడు పోస్టులపై విచారణ జరిపించి, ఈ పోస్టులను పెట్టిన వారిని గుర్తించాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, GHMC యూసుఫ్‌గూడ సర్కిల్–19 అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ యాహియా కమల్ చేసిన ఫిర్యాదు మేరకు మధుర నగర్ పోలీసులు ఈ మార్ఫింగ్ ఫోటోలపై కేసు నమోదు చేశారు.
కొంతమంది సినీ నటీమణుల ఎడిట్ చేసిన చిరునామాలు, ఛాయాచిత్రాలు, చెల్లని EPIC నంబర్లతో ఓటర్ల జాబితాను సిద్ధం చేశారని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదుదారులు నివేదించారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకుని, మధుర నగర్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS) Cr. No. 686/2025 U/s 336(4), 353(1)(C) కింద కేసు నమోదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఓటర్ల జాబితాకు సంబంధించి ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని ఎన్నికల అధికారులు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే కంటెంట్‌ను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాబట్టి, సినీ నటులు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ జూబ్లీహిల్స్ ఓటర్లని వైరల్ ఫోటోలను మార్ఫింగ్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.

